ధోని వెళ్లాడు.. ఆయనొస్తున్నాడు

Update: 2015-08-07 08:18 GMT
ఒక ఆటగాడి తలరాతలు మార్చేవాడు సెలక్టర్. కానీ ఓ ఆటగాడు సెలక్టర్ రాత మార్చేస్తాడా? అంత సత్తా ఉన్న ఏకైక ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీనే. అతను వద్దన్న పాపానికి ఓ సెలక్టరే తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్మగలరా? ఇది వాస్తవం. నాలుగేళ్ల కిందట ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమ్ ఇండియా దారుణాతి దారుణంగా ఆడి వైట్ వాష్ లకు గురైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ధోని కెప్టెన్సీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అతణ్ని కెప్టెన్సీ నుంచి దించేయాలన్న డిమాండ్లు వినిపించాయి. మిగతా వాళ్లు మీడియాలో డిమాండ్ వినిపిస్తే అప్పుడు భారత క్రికెట్ సెలక్టర్ గా ఉన్న మొహిందర్ అమర్ నాథ్ బీసీసీఐ సమావేశంలోనే గళం విప్పాడు. ధోనీని తప్పించాల్సిందేనని పట్టుబట్టాడు. ఐతే తనకెంతో ఇష్టుడైన ధోనీని తప్పుకోమని డిమాండ్ చేస్తే శ్రీనివాసన్ ఊరుకుంటాడా? అప్పుడు ఆయన బీసీసీఐ అధ్యక్షుడు మరి. ధోనీ తప్పుకోమంటావా అంటూ అమర్ నాథ్ నే తప్పించేశాడు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు బోర్డులో శ్రీనివాసన్ పనైపోయింది. టీమ్ ఇండియాలో ధోని కథ కూడా దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ చెప్పేశాడు మహి. వన్డేల్లో ఇంకెంత కాలం కొనసాగుతాడో తెలియదు. ప్రస్తుతం భారత జట్టులో విరాట్ కోహ్లి హవా సాగిస్తుంటే.. పాలనలో దాల్మియా అండ్ కోదే ఆధిపత్యం చలాయిస్తున్నారు. వీళ్లకు శ్రీనివాసన్ అంటే అస్సలు పడదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమర్ నాథ్ ను సెలక్షన్ కమిటీలోకి తిరిగి తీసుకురావడమే కాదు.. ఛైర్మన్ ను చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ పాటిల్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ పదవీ కాలం ఈ సెప్టెంబరులో ముగియనుంది. పాటిల్ స్థానంలో అమర్ నాథ్ ను చీఫ్ సెలక్టర్ ను చేయబోతున్నట్లు సమాచారం. మరి అప్పుడు ధోనీ కారణంగా పదవి కోల్పోయిన అమర్ నాథ్.. ఇప్పుడు సెలక్షన్ కమిటీ పగ్గాలు చేపడితే ధోనీని ఎంతకాలం ఉండనిస్తాడన్నది సందేహం.
Tags:    

Similar News