బీసీసీఐకి బుర్ర పనిచేయట్లేదు

Update: 2015-06-27 11:45 GMT
బంగ్లాదేశ్ పర్యటన అయిపోయింది.. మరి టీమ్ఇండియా ఇప్పుడేం చేయబోతోంది? ఏ జట్టుతో సిరీస్ ఆడబోతోంది? ఎప్పుడు ఆడుతుంది? ఈ విషయంలో అభిమానులకు క్లారిటీ లేకపోతే పర్వాలేదు. పోనీ ఆటగాళ్లకైనా ఉందా అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే జులై పదో తారీఖున మొదలవ్వాల్సిన జింబాబ్వే పర్యటన విషయంలో సస్పెన్స్ నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే జులై తొలి వారంలో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాలి. పదో తారీఖు నుంచి మూడు వన్డేలు, రెండు టీ20ల సిరీస్ ఆడాలి. వారం కిందటి వరకు ఇదే క్లారిటీతో ఉంది టీమ్ఇండియా.

కానీ బీసీసీఐ ఈ పర్యటనను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నట్లు వార్తలు రావడంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. దీనికి కారణమేంటంటే.. జింబాబ్వే ఆడే అన్ని సిరీస్‌లనూ టెన్ స్పోర్ట్స్ ఛానెల్ ప్రసారం చేయాల్సి ఉంది. దాని యజమాని సుభాష్ చంద్ర. గతంలో ఈయన బీసీసీఐకి వ్యతిరేకంగా ఐసీఎల్ ఆరంభించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ గొడవ సద్దుమణగడానికి చాలా ఏళ్లు పట్టింది. ఇప్పుడు మరోసారి బీసీసీఐకి, ఐసీసీకి వ్యతిరేకంగా ఇంకో లీగ్ మొదలుపెట్టడానికి సుభాష్ చంద్ర ప్రయత్నిస్తున్నారు. దీనిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ.. భారత జట్టు ఆడే సిరీస్‌ను టెన్ స్పోర్ట్స్ ప్రసారం చేయడానికి వీల్లేదంటోంది. కానీ జింబాబ్వే అధికారులు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వారికి టెన్ స్పోర్ట్స్ ‌తో అగ్రిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పర్యటనను సస్పెన్స్‌లో పెట్టింది బీసీసీఐ. పోనీ ఈ సిరీస్ ను రద్దు చేసేసినా పోయేది. అలాంటిదేమీ చేయకుండా సెలక్టర్లకు మాత్రం ఈ నెల 29న జట్టును ఎంపిక చేయమని చెప్పింది. మొత్తానికి బీసీసీఐ తాను గందరగోళంలో ఉంటూ మిగతా వాళ్లను కూడా గందరగోళంలోకి నెట్టేస్తోంది.
Tags:    

Similar News