ఆ మూడు జిల్లాల్లో మార్పులు చేర్పులకు వైసీపీ సిద్ధం!

Update: 2023-03-24 11:40 GMT
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడుకు మూడు స్థానాలను ఓడిపోయింది. దీంతో వైసీపీ నష్టనివారణ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పట్టభద్రులు వైసీపీకి తీవ్ర షాక్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇందుకు కారణాలను తెలుసుకునే పనిలో ఉందని.. ఆ తర్వాత మార్పులుచేర్పులకు సిద్ధమవుతుందని అంటున్నారు.

ముఖ్యంగా రాయలసీమలో తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని వైసీపీ తట్టుకోలేకపోతోందని అంటున్నారు. ఎందుకంటే రాయలసీమ వైసీపీకి కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో రాయలసీమలో అత్యధిక అసెంబ్లీ సీట్లను వైసీపీనే గెలుచుకుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేటప్పటికి బొక్క బోర్లా పడింది. దీంతో ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకునే పనిలో ఉందని అంటున్నారు.

ముఖ్యంగా జిల్లాల విభజన వైసీపీ ఓటమికి కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. కడప జిల్లాను విభజించి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే దీనికి జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా రాయచోటిని నిర్ణయించడంపై వైసీపీలోనే అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. సాక్షాత్తూ వైసీపీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఇతర వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం రాయచోటినే జిల్లా కేంద్రంగా చేసింది.

ఇక వైసీపీ మంత్రులు ఉషశ్రీ చరణ్, గుమ్మనూరు జయరాంలపై ఇప్పటివరకు ఏ మంత్రిపైనా రానన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. మీడియాలోనూ వీరిద్దరిపై అనేక కథనాలు వచ్చాయి. అయితే వీరిద్దరూ బీసీ నేతలు కావడంతో వీరిపై చర్యలకు వైసీపీ జంకుతోందని అంటున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహార శైలి కూడా ఆది నుంచి వివాదాస్పదంగానే ఉందని గుర్తు చేస్తున్నారు. ఆయనపైన కూడా చర్యలు లేవు. గోరంట్ల మాధవ్‌ కూడా బీసీ నేత కావడంతో చర్యలు తీసుకుంటే ఆ సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతాయనే భయం వైసీపీ అధిష్టానానికి ఉందని అంటున్నారు.

జిల్లాల విభజనపై ఉన్న అసంతృప్తి, వైసీపీ మంత్రులు, ఇతర నేతల వ్యవహార శైలి వల్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని వైసీపీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చిందని అంటున్నారు.  

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే పార్టీపరంగా, పరిపాలన పరంగా మార్పులు తప్పవని వైసీపీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. మార్పులుచేర్పులు చేయకుంటే కంచుకోట అయిన రాయలసీమలో తీవ్ర దెబ్బ తప్పకపోవచ్చని అంటున్నారు. దీంతో మార్పులుచేర్పులు దిశగా వైసీపీ అధిష్టానం సిద్ధమవుతుందని చెబుతున్నారు.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News