భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో అస్త్రం... ఏమిటీ 'రుద్రాస్త్ర'?
అవును... భారత అమ్ముల పొదిలోకి మరో వినూత్న మానవ రహిత విమానం (యూఏవీ) చేరనుంది.;
భారత అమ్ములపొదిలో శత్రు దాడిని సక్సెస్ ఫుల్ గా అడ్డుకునే రక్షణ వ్యవస్థలతోపాటు పక్కాగా దాడిచేసే బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ లో వీటి పెర్ఫార్మెన్స్ పై ప్రపంచానికి ఒక క్లారిటీ వచ్చింది! ఈ నేపథ్యంలో భారత సాయుధ దళాల అమ్ములపొదిలోకి మరో వినూత్నమైన మానవ రహిత విమానం చేరనుంది.
అవును... భారత అమ్ముల పొదిలోకి మరో వినూత్న మానవ రహిత విమానం (యూఏవీ) చేరనుంది. ఇందులో భాగంగా... "రుద్రాస్త్ర" యూఏవీని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో విజయవంతంగా పరీక్షించారు. దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ లిమిటెడ్ రూపొందించింది. ఇది హైబ్రీడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుంది.
పోఖ్రాన్ లో జరిగిన ఈ పరీక్షలో లక్ష్యంపై అత్యంత కచ్చితత్వంతో యాంటీ పర్సనల్ వార్ హెడ్ ను ప్రయోగించింది. ఇది భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ వార్ హెడ్ ను పేల్చేసింది. దీంతో.. ఈ పరీక్ష రక్షణ రంగంలో భారత్ టెక్నాలజీల వృద్ధిలో మరో ముందడుగును సూచిస్తుంది.
ఈ యూఏవీ 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పని చేసింది. ఇది స్థిరమైన రియల్ టైం వీడియోను అందించడంతోపాటు.. సేఫ్ గా లాంచింగ్ పాయింట్ కు తిరిగి వచ్చింది. ఇది గంటన్నరసేపు నిరంతరంగా ఆకాశంలో ప్రయాణించింది. లక్ష్యంపై చక్కర్లు కొట్టడం కూడా కలుపుకొంటే దీని రేంజి 170 కిలోమీటర్లు ఉంటుంది.
కాగా... శత్రు యుద్ధ నౌకలపై సైలెంట్ గా దాడి చేయగల వాటర్ డ్రోన్ ను డీ.ఆర్.డీ.వో. ఏప్రిల్ లో విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ యాంటీ డ్రోన్ వ్యవస్థ "భార్గవాస్త్ర"ను కూడా రూపొందించి.. దీనిని మే నెలలో విజయవంతంగా పరీక్షించారు.