ఏపీ ప్రజల మనసు దోచిన వైసీపీ ఎమ్మెల్యే

Update: 2016-03-30 11:07 GMT
నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలని అనుకున్నారో... రాజకీయం చేయాలనుకున్నారో.. లేదంటే నిజంగానే ఆయన మనస్సాక్షి అంగీకరించక ఆ మాట అన్నారో కానీ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి మాత్రం బుధవారం అసెంబ్లీలో గొప్పగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆయన వ్యతిరేకించారు. ఇంతవరకు ప్రతి విషయంలోనూ ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా ఉన్న టీడీపీ, వైసీపీలు తమ జీతాల బిల్లుకు వచ్చేసరికి ఏకతాటిపైకి వచ్చి ఓకే అనగా వైసీపీలో ఒక్క కోటంరెడ్డి మాత్రమే వ్యతిరేకత తెలిపారు. దీనిపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రతిపక్షం కలసి తీసుకున్న నిర్ణయాన్ని తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
    
'ఒకవైపు రాష్ట్రంలో నిధులు లేవని చెబుతారు, ప్రజలు సహకరించాలని చెబుతారు. అంటే ప్రజలు త్యాగాలు చెయ్యాలి, రాష్ట్రాన్ని పాలించే వారు త్యాగాలు చేయరా?' అని ఆయన సూటిగా అడిగారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి నచ్చిన ఏదో ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై రెఫరెండం చేపట్టాలని ఆయన సూచించారు. అక్కడి దీనికి అనుకూలంగా ప్రజలు ఓటేస్తే...తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాలు విసిరారు. ప్రజావ్యతిరేక విధానాలు సరికాదని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా? అని ఆయన నిలదీశారు. జీతాల పెంపును అంతా సమర్థిస్తున్నప్పటికీ తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.
    
కాగా కోటంరెడ్డి తీరుకు ప్రజల్లో మంచి మద్దతు కనిపిస్తోంది. అన్ని వర్గాల వారు ఆయన వాదనతో ఏకీభవిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అడ్డంగా దోచుకుంటున్నది చాలక ఇప్పుడు జీతాల పేరుతోనూ ఖజానాను కొల్లగొట్టడం అవసరమా అంటున్నారు. అంతేకాదు... కోటం రెడ్డి చెప్పినట్లుగా ఏ నియోజకవర్గంలో సర్వే చేసినా ఎమ్మెల్యేల జీతాల పెంపును అందరూ వ్యతిరేకిస్తారనే అంటున్నారు.
Tags:    

Similar News