మరోసారి భూమాను అరెస్ట్‌ చేశారు

Update: 2015-07-03 14:30 GMT
ఆ మధ్యన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్న సమయంలో తలుపులు వేయండ్రా.. ఎవరేం చేస్తారో చూస్తా అంటూ నంద్యాలలో హల్‌చల్‌ చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన పోలింగ్‌లో చోటు చేసుకున్న ఘటనలతో ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

పోలింగ్‌ సందర్భంగా పోలీసు అధికారులతో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వ్యవహరించిన అనుచిత వైఖరితో ఆయనపై కేసు నమోదు చేశారు. తమ విధులను ఆటంకం కలిగిస్తూ.. అడ్డుకున్నారన్న ఆరోపణపై భూమాను అరెస్ట్‌ చేసి నంద్యాలలోని త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

నంద్యాల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయటానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే.. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ వచ్చారు. అలా వచ్చిన ఆమె ఓటు వేయకుండా ఉండిపోవటంతో.. అలా వద్దని.. ఓటు వేసి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. తన తండ్రి వచ్చే వరకూ ఉంటానని.. ఇద్దరం కలిసి ఓటు వేస్తామని ఆమె చెప్పటంతో ఆమెకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ సందర్భంగా పోలీసులతో ఎమ్మెల్యే అఖిల ప్రియ దురుసుగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భూమా నాగిరెడ్డి పోలింగ్‌ బూత్‌కి వచ్చి.. తన కుమార్తెను వెళ్లమనటానికి మీరు ఎవరంటూ విరుచుకుపడ్డారు. దీంతో.. పోలీసులతో జరిగిన వాగ్వాదం శృతి మించటంతో ఆయనపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా అరెస్ట్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక భూమాను రెండోసారి అరెస్ట్‌ చేసినట్లు అయ్యింది.

Tags:    

Similar News