భారతీయ జనతా పార్టీకి రైట్ టీడీపీ- లెఫ్ట్ వైఎస్సార్సీపీ?

Update: 2019-08-22 11:26 GMT
భారతీయ జనతా పార్టీ ఏపీ రాజకీయంలో చిత్రమైన రాజకీయం చేస్తూ ఉంది. ముందుగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం బేస్ మెంట్ లేదు. ఇటీవలి ఎన్నికల్లో వచ్చింది కేవలం సున్నా పాయింట్, నాలుగు శాతం ఓట్లు మాత్రమే. అయినా ఏపీ రాజకీయంలో బీజేపీ తన స్థాయికి మించి హడావుడి చేస్తూ ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ హడావుడికి అంతో ఇంతో ప్రాధాన్యత దక్కుతూ ఉంది. ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో  అనేది ప్రజల్లో చర్చగా నిలుస్తూ ఉంది. అదే సమయంలో ఏపీలో తమకు భవితవ్యం ఉందని బీజేపీ వాళ్లు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఏపీకి మాత్రం వారు ఏరకంగానూ సహకరిచరు. ప్రత్యేకహోదాతో సహా ప్రతి విషయంలోనూ మోసమే చేస్తూ ఉంటారు.

ఇక ఏపీ ప్రభుత్వ విధానాల విషయంలో కూడా వారు రెండు రకాల టోన్లతో మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా ఢిల్లీలోని పెద్దలేమో జగన్ కు భరోసా అంటున్నారు. జగన్ కోరినప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. జగన్ ను వెన్నుతడుతూ ఉన్నారు ప్రధాని మోడీ. ఇక పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయానికి మోడీ- అమిత్ షాల మద్దతు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రకటించడం గమనార్హం.

పోలవరం కేంద్ర ప్రాజెక్టు కావడంతో ఆ ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఏపీలోని భారతీయ జనతా పార్టీ వాళ్లు మాత్రం జగన్ ప్రభుత్వం మీద ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇటీవల తెలుగుదేశం నుంచి బీజేపీలోకి చేరిన వారు అయితే ఏపీలో అప్పుడే మత చిచ్చు రేపడానికి తెగ ఉబలాటపడుతూ ఉన్నారు. ఇక జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అచ్చం చంద్రబాబు నాయుడు టోన్లో వీరు మాట్లాడుతూ ఉన్నారు.

ఇలా ఏపీ రాజకీయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అనుకూల సంత ఆ పార్టీలో చేరి .. ఇప్పుడు ఆయన టోన్ ను ఆ పార్టీ ద్వారా వినిపించడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రం స్పష్టంగానే అర్థం అవుతోంది ప్రజలకు!
Tags:    

Similar News