సగర్వంగా ఎంట్రీ ఇచ్చి.. మౌనంగా తలదించుకొని వెళ్లిన సజ్జల

Update: 2023-03-24 09:25 GMT
రాజకీయాల్లో అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు. ఏదైనా సాధ్యమే. అప్పటివరకు కత్తులు నూరుకున్న నేతలు.. ఒక్కసారిగా భుజంభుజం రాసుకుతిరగటం చూస్తుంటాం. అప్పటివరకుజీరోగా ఉన్న నేత.. ఒక్కసారిగా హీరోగా మారటం.. రాత్రికి రాత్రే సీన్ మారిపోవటం ఒక్క రాజకీయాల్లోనే సాధ్యమని చెప్పాలి. ఈ తత్త్వం తెలిసిన రాజకీయ నేతలు కాస్తంత ఒద్దికగా.. అణిగిమణిగి ఉంటారని చెబుతారు. అందుకు భిన్నంగా వ్యవహరించే వారికి ఏదో ఒకప్పుడు తిప్పలు తప్పవన్నది వాస్తవం. ఆ అనుభవం తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు కమ్ జగన్ కు అన్నీ అయినట్లుగా వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డికి ఎదురైందని చెప్పాలి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అనూహ్యంగానే కాదు.. సంచలనంగా మారటం తెలిసిందే. పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపునకు హాజరైన సజ్జలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తమ అభ్యర్థులంతా గెలుపు ఖాయమన్న ధీమాతోఆయన ఎంట్రీ ఇచ్చారు. అందరిని పలుకరిస్తూ.. వచ్చిన ఆయన చివరకు వచ్చిన ఫలితంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని వెళ్లిపోయిన వైనం ఆవిష్క్రతమైంది.

తమకున్న సంఖ్యాబలంతో ఏడుసీట్లను సొంతం చేసుకునే అవకాశాలుకాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. తమకున్న మంత్రాంగంతో ఆ పని పూర్తి చేయొచ్చన్న పట్టుదలతో ఉన్న సీఎం జగన్.. ఏడు స్థానాలకు అభ్యర్థులను పోటీకి పెట్టారు. అంతేకాదు.. సీఎం జగన్ ఆదేశాలతో ఆయన వైసీపీ అభ్యర్థుల్లో ఒకరి తరఫున పోలింగ్ ఏజెంట్ గా కూర్చోవాల్సి వచ్చింది.

ఆయన ఎదురుగా ఉంటే..ఎమ్మెల్యేలు గీత దాటరన్న నమ్మకంతో పాటు.. అసలేం జరిగిందన్న విషయానికి సంబంధించి కూడా గ్రౌండ్ రిపోర్టు కోసం సజ్జలను నేరుగా రంగంలోకి దించారు. అంతేకాదు.. ఓట్ల లెక్కింపు వేళలో ఆయనే ఎదురుగా ఉంటే.. అధికారులు సైతం జాగ్రత్తగా ఉంటారన్నఆలోచన కూడా ఉందని చెబుతారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ముఖ్యమంత్రి.. తమ వారిలోని వ్యతిరేకతను గుర్తించే విషయంలో మాత్రం బోర్లా పడ్డారు. పోలింగ్ పూర్తై.. ఓట్ల లెక్కింపు వేళలోనూ వైసీపీ నేతల్లో తామే అన్ని స్థానాల్ని గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్నారు.

టీడీపీ తరఫున ఏజెంట్లుగా పని చేస్తున్న వారిలోనూ గెలుపు వైసీపీదే అన్న భావన ఉన్నప్పటికీ.. బయటకు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే.. తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ట్రేలో 20 ఓట్లు పడగానే... లెక్క చూసుకున్న టీడీపీ తరఫున ఏజెంట్ గా ఉన్న పయ్యావుల కేశవ్ గెలుపు తమదేనని తేల్చేశారు. విజయం తమదేనని చెప్పుకోవటం వైసీపీ నేతల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో అనురాధకు 22 ఓట్లు వస్తే గెలుస్తారు. కానీ.. ఆమెకు ఏకంగా 23 ఓట్లు రావటంతో వైసీపీ నేతలంతా షాక్ తిన్నారు.  అనంతరం రీకౌంటింగ్ కోసం పట్టుపట్టటం.. ఆ సందర్భంగా కాసింత డ్రామా చోటు చేసుకుంది. చివరకు మరోసారి లెక్కింపు చేపట్టగా.. మొదట వచ్చిన ఫలితమే రెండోసారి వచ్చింది. దీంతో అనురాధ గెలుపు ఖరారు కాగా..అప్పటివరకు హడావుడి చేసిన వైసీపీ నేతలు అవమానంతో వెళ్లిపోయిన పరిస్థితి. ఆ సమయంలో అక్కడే ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి మౌనంగా ఉండిపోయి.. తలదించుకొని వెళ్లిన వైనం అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

Similar News