బంజారాహిల్స్ లో పీవీపీ దాదాగిరి: ఓ వ్యక్తిని ఇంట్లోకి దూసుకెళ్లి వార్నింగ్

Update: 2020-06-24 09:30 GMT
పారిశ్రామికవేత్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మరోసారి దాదాగిరి చేశాడు. గతంలో ఓ సినిమా నిర్మాణం చేయగా ఆ లావాదేవీల విషయంలో ఓ నిర్మాతను బెదిరింపులకు పాల్పడిన పీవీపీ ఇప్పుడు తాజాగా మరో వ్యక్తిని బెదిరింపులకు పాల్పడి ఏకంగా అతడి ఇంటిని కూల్చేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రావడంతో పీవీపీ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లో జరిగింది.

దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 14లో పీవీపీ ఇంటి పక్కన కైలాశ్ అనే వ్యక్తి ఇల్లు ఉంది. రెండేళ్ల క్రితమే ఇంటిని కొనుగోలు చేసి ఇప్పుడు ఆ ఇంటిని మరమ్మతులు చేయిస్తున్నాడు. అయితే ఈ పనులతో తన ఇల్లు కనిపించడం లేదని.. తన ఇంటి గోడలు పగులుతున్నాయని ఉద్దేశపూర్వకంగా పనులను అడ్డగిస్తున్నారు. దీనిపై గతంలో కైలాశ్ ను ఫోన్ లో బెదిరింపులకు పీవీపీ పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ బుధవారం ఉదయం తన అనుచరులతో కైలాశ్ ఇంటి రూఫ్ టాప్ గార్డెన్ పనులు కూల్చడం మొదలు పెట్టారు. దీంతో కైలాశ్ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. వారందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.

ఈ విషయ మై పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) అనుచరులు తనపై దాడి చేశారని కైలాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఇరు వర్గాలను పిలిచి విచారణ చేస్తున్నారు. పీవీపీ మాత్రం తన దగ్గర భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ ఘటనపై బాధితుడు కైలాశ్ స్పందించి మీడియా తో మాట్లాడారు... ‘‘రూఫ్ టాప్ గార్డెన్ కడితే కూల్చేస్తానని పీవీపీ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల క్రితమే ఇంటిని కొనుగోలు చేశాం. ఇటీవలే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆరు నెలల క్రితం ఫోన్లో బెదిరించారు. మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడం తో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. ఆయన ఇల్లు మా ఇంటి వెనుక ఉంటుంది. ఆయన ఇల్లు సరిగా కనిపించదని పీవీపీ అంటున్నారు’’ అని  వాపోయాడు.

దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇరు వర్గాలను రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News