వారిని వదిలిపెట్టను.. వైరల్ వీడియో పై టీటీడీ చైర్మన్ వివరణ
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న వ్యక్తులే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసత్య ఆరోపణలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాను టీటీడీ ఛైర్మన్‌గా నిస్వార్థంగా పనిచేస్తున్నానని.. ఈ పదవి తనకు జీవనోపాధి కాదని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తనను ఈ బాధ్యతకు నియమించిందని, ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నానన్నారు. తనపై ప్రచారం జరుగుతున్న వీడియోను కొంతవరకు మార్ఫింగ్ చేశారని.. అందులో ఎలాంటి అసభ్యత లేదని ఆయన స్పష్టం చేశారు. వీడియోలో కనిపిస్తున్నవారు తనకు సుదీర్ఘకాలంగా పరిచయం ఉన్న కుటుంబ స్నేహితులేనని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అదే సమయంలో తనపై విమర్శలు చేస్తున్న కొందరు నాయకులపై కూడా బీఆర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను రాజీనామా చేయాలని కోరే హక్కు ఎవరికీ లేదని, నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనపై దుష్ప్రచారం చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
బీఆర్ నాయుడు మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తనను రాజీనామా చేయమని కోరుతున్న భూమన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందిస్తూ, “నన్ను రాజీనామా చేయమనడానికి మీరెవరు?” అని ప్రశ్నించారు. తాను ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిలబడతానని, “తగ్గేదేలేదు” అంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రత్యర్థి నేతలపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “మీ అరాచకాలు ఒకటి, రెండు కావు. అవసరమైతే అన్నీ బయటపెడతా” అంటూ హెచ్చరించారు. తాను టీటీడీకి ఎలాంటి మచ్చ తేలేదని, తన పదవిలో ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.