బీజేపీకి బీపీ తెప్పించే పనిలో జగన్... ?

Update: 2021-11-04 11:10 GMT
బీజేపీకి ఆ మాట అసలు ఇష్టం ఉండదు, ఆ మాట చెవిన సోకడానికే నో చెప్పే సీన్ బీజేపీ పెద్దలది. అటువంటి మాటనే ఇపుడు ఏరి కోరి మరీ ఎంచుకుని బీజేపీకి గట్టిగా వినిపించేలా జగన్ ఒకటికి పదిసార్లు చెప్పబోతున్నారుట. కేంద్రంలోనూ, బీజేపీలోనూ  మోడీ తరువాత స్థానంలో ఉన్న అమిత్ షా ఏపీకి తానే స్వయంగా వస్తున్నారు. ఈ నెల 14న ఆయన తిరుపతి వేదికగా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని వేదికగా చేసుకుని జగన్ తనదైన రాజకీయానికి పదును పెట్టబోతున్నారు. అదేంటి అంటే ఏపీకి ప్రత్యేక హోదా ఎపుడు ఇస్తారూ అంటూ నేరుగా అమిత్ షానే నిలదీయబోతున్నారుట. ఏపీకి ఇచ్చిన ఈ హామీ ఎపుడు తీరేను అంటూ గట్టిగానే అడుగుతారు అంటున్నారు.

అదే విధంగా ఏడేళ్ళుగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఏమీ కాకుండా పడి ఉన్నాయి. వాటి వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతోంది, ఆర్ధికంగా కూడా దారుణంగా ఏపీ ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాలను కూడా అమిత్ షతో అమీ తుమీకే జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. అమిత్ షాను ఢిల్లీలో కలసినపుడు జగన్ చాలా సార్లు ప్రత్యేక హోదా మీద వినతి చేస్తూ వచ్చారు. కానీ ఇపుడు ఆయనే ఏపీకి వస్తున్నారు. దాంతో తమ అజెండా ఏంటో చెప్పి చూడాలని జగన్ భావిస్తున్నారు. ఇలా జగన్ సడెన్ గా ప్రత్యేక హోదాను భుజానికెత్తుకోవడానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు.

ఏపీలో ప్రత్యేక హోదా మీద విపక్షంలో ఉన్న నాడు జగన్ ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించి బాగానే లబ్ది పొందారు. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబుని ఆయన ఈ విషయంలో ఇరికించేశారు. ఇపుడు అధికారంలో ఉన్నారు. నిజానికి ప్రత్యేక హోదా అని విపక్షాలు గట్టిగా సౌండ్ చేస్తే ఇబ్బంది పడాల్సింది జగనే. కానీ ఏపీలోని ప్రతిపక్షాలు ఆ నినాదాన్ని ఎత్తుకునేందుకు ఏ కోశానా సిద్ధంగా లేవు. దానికి కారణం ఏంటి అంటే అవి ఇపుడు బీజేపీతో జట్టు కట్టేందుకు చూస్తున్నాయి. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఇక టీడీపీ అయితే బీజేపీని విమర్శించడమే మానుకుంది. వీలైతే పొగుడుతూ ముందుకు సాగుతోంది.

దాంతో జగన్ కూడా హోదా విషయనంలో సైలెంట్ గా ఉంటే అది ముగిసిన అధ్యాయంగానే ఉండేది. కానీ జగన్ కి ఇపుడు హోదా అవసరం వచ్చి పడుతోంది. వచ్చే ఎన్నికల్లో మరో మారు గెలవాలి అన్నదే జగన్ ఆలోచన. దాని కోసం ఆయన ఏపీలో విపక్షాల మధ్య విభేదాలు తేవాలని అనుకుంటున్నారు. బీజేపీతో టీడీపీ కలిస్తే ఇబ్బందులు తప్పవని వైసీపీ భావిస్తోంది. దాంతో బీజేపీ నుంచి వాటిని  వేరు చేసే ఆయుధంగానే ప్రత్యేక హోదాను ఎంచుకుంటోంది అంటున్నారు. అధికారంలో ఉన్న జగనే హోదా గురించి కేంద్రాన్ని నిలదీస్తే విపక్షాలు కూడా కచ్చితంగా ఆ అజెండాను అనుసరించాల్సిందే.

మరో వైపు జనంలో బీజేపీని చెడ్డ చేస్తే ఆ పార్టీ మీద ఆగ్రహం రగిలిస్తే కచ్చితంగా టీడీపీ కమలానికి దూరం జరుగుతుంది. జనసేన కూడా పునరాలోచనలో పడుతుంది. ఈ రకమైన వ్యూహంతోనే జగన్ హోదాను ముందుకు తెస్తున్నారు అంటున్నారు. సరే జగన్ వైపు నుంచి ఇది వ్యూహంగానే ఉంది, కానీ కేంద్రంలోని బీజేపీ ఇలాంటి వ్యూహాలకు లొంగుతుందా తమను బదనాం చేయలనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అదే టైమ్ లో ఏపీలోని టీడీపీ కూడా హోదా నిందను బీజేపీ మీద వేయకుండా జగన్ మీద చేసి ఆయన్ని కార్నర్ చేస్తే అపుడు పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి జగన్ రాజకీయం బీజేపీ ముందు ఎలా నెగ్గుతుందో.
Tags:    

Similar News