కేసీఆర్ బాట‌లో న‌డుస్తున్న జ‌గ‌న్‌!

Update: 2017-12-01 04:19 GMT
ప్ర‌జ‌ల క‌ష్టాల్ని నేరుగా తెలుసుకోవ‌టం కోసం ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన పాద‌యాత్ర నిరాటంకంగా సాగుతోంది. ఇబ్బందుల్ని అధిగ‌మ‌నిస్తూ.. అలుపెర‌గ‌ని రీతిలో సాగుతున్న ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. పాద‌యాత్ర‌ను మొద‌లుకొని ప‌లు వ‌ర్గాల వారికి ఊహించ‌ని రీతిలో హామీలు ఇస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా వెలుగు యానిమేట‌ర్ల‌కు అపురూప‌మైన హామీని ఇచ్చారు. బాబు స‌ర్కారులో నిర్వీర్య‌మైన యానిమేట‌ర్ల భ‌విత‌కు ధీటైన హామీ ఇచ్చారు.

జ‌గ‌న్ ఇచ్చిన హామీతో యానిమేట‌ర్లు ఆనందం వ్య‌క్తం చేశారు. ప‌ని చేయించుకుంటూ క‌నీస వేత‌నం ఇవ్వ‌ని బాబు స‌ర్కారు తీరుపై వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారికి వ‌చ్చే జీతాల గురించి చెప్పి ఆవేద‌న చెందిన వారు.. ప‌క్క‌నున్న తెలంగాణ రాష్ట్రంలో రూ.5వేలు ఇస్తున్నార‌ని.. ఏపీలో అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు.

దీనికి వెంట‌నే స్పందించిన జ‌గ‌న్‌.. తమ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వెలుగు యానిమేట‌ర్ల ఇబ్బందుల్ని తొల‌గిస్తామ‌ని.. వారి జీతాల్ని ఏకంగా రూ.10వేల‌కు పెంచుతామ‌ని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్నామ‌న్నా.. జీతాలు పెంచాల‌న్న డిమాండ్ తో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారికి క‌డుపు నిండుగా వ‌రాన్ని ఇవ్వ‌టం తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో క‌నిపిస్తుంది.

తాజాగా జ‌గ‌న్ తీరు చూస్తే.. సంక్షేమ ప‌థ‌కాలు.. హామీల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఏ మాత్రం తీసిపోన‌ట్లుగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.పాద‌యాత్ర‌లో భాగంగా ఇప్ప‌టికే ప‌లు వ‌ర్గాల‌కు భారీ హామీల్ని ఇచ్చారు జ‌గ‌న్‌. తాజాగా వెలుగు యానిమేట‌ర్లకు జ‌గ‌న్ ఇచ్చిన హామీతో వారు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిక కావాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. పాద‌యాత్ర మొద‌లు పెట్టిన నాటి నుంచి వివిధ వ‌ర్గాల వారు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌న్న అభిప్రాయాన్ని బ‌లంగా వినిపిస్తుండ‌టం క‌నిపిస్తోంది.
Tags:    

Similar News