ఏపీలో చదువుల విప్లవం.. జగన్ సంచలనం

Update: 2019-06-14 08:53 GMT
ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థను ప్రక్షాళన దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం రాజన్న బడిబాట కార్యక్రమం నుంచే శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక పాఠశాలలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. చిన్నారులను ఒడిలో కూర్చుండబెట్టుకొని మరీ అక్షరాలు దిద్ది సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ బడికి పంపే ప్రతీ కుటుంబానికి జనవరి 26న రూ.15వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. బడీడు పిల్లలకు మామగా అండగా ఉంటానని.. ప్రైవేటు విద్యాసంస్థల ఆధిపత్యాన్ని తగ్గిస్తానని ప్రకటించారు. రెండేళ్లలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నారాయణ, శ్రీచైతన్య పేరిట ఎల్ కేజీకే 20వేల చొప్పున దోచుకుంటున్నారని.. వీటిని పూర్తిగా నియంత్రిస్తానని జగన్ హెచ్చరికలు పంపారు. ఏపీలో చదువుల విప్లవం తీసుకొస్తానని ప్రకటించారు.

దేశవ్యాప్తంగా 26శాతం నిరక్ష్యరాస్యత ఉంటే.. ఏపీలో 33శాతం ఉందని జగన్ వివరించారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన.. ఉపాధ్యాయుల భర్తీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో విద్యాలయాలుగా మారుస్తామన్నారు.

రాష్ట్రంలో తల్లిదండ్రులంతా పిల్లలను బడికి పంపాలని.. బడికి వెళ్లే ప్రతీ పిల్లలకు తాను మామగా ఉంటన్నానని జగన్ హామీ ఇచ్చారు. పిల్లలను బడికి పంపే తల్లులకు జనవరి 26న అమ్మఒడి పథకం ద్వారా 15వేల రూపాయలు అందిస్తామని.. ఉన్నత చదువులు చదువుకోవాలని వారికి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానన్నారు.


Tags:    

Similar News