ఏపీలో ప్రారంభ‌మైన ఓటింగ్ ప్ర‌క్రియ!

దీనిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌స్తుత ఎన్నిక‌ల స‌మ‌యంలో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

Update: 2024-05-02 16:12 GMT

అదేంటి అనుకుంటున్నారా? ఎన్నిక‌ల‌కు ఇంకా మ‌రో 11 రోజుల స‌మ‌యం ఉంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారా? కానీ.. 11 రోజుల ముందుగానే ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ అయితే ప్రారంభ‌మైంది. అది కూడా గురువారం మ‌ధ్యాహ్నం నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేని స్థితిలో వృద్ధులు, దివ్యాంగుల కోసం.. ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డ‌మే. దీనిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌స్తుత ఎన్నిక‌ల స‌మ‌యంలో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనినే ``హోం ఓటింగ్ విధానం``గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది.

ఈ విధానంలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం పైబ‌డిన విక‌లాంగుల‌కు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఈ ప్ర‌క్రియ 6 రోజులు సాగ‌నుంది. రాష్ట్రంలో మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ కోసం ద‌రఖాస్తు చేసు కున్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతం విక‌లాంగులు 5,17,227 మంది ఉన్నారు. అయితే వీరిలో కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో వారి ఇళ్ల‌కు వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటు వేయిస్తున్నారు. వీటిని ప్ర‌త్యేక ఇనుప బాక్సుల్లో భ‌ద్ర‌ప‌రుస్తున్నారు.

Read more!

హోం ఓటింగ్ ను ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృంధం వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందజేసి హోం ఓటింగ్ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు విషయంలో హైకోర్టులో కేసు దాఖలు కావ‌డంతో ఈ విధానం ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. దీంతో కొన్ని జిల్లాలో గురువారం నుండి హోం ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభ మైంది. పలు జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలును రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ హోం ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఈ నెల 8 కల్లా పూర్తవుతుంది. అనంత‌రం ప్ర‌ధాన ఓటింగ్ ప్ర‌క్రియ 13న జ‌ర‌గ‌నుంది.

Tags:    

Similar News