వాళ్లకు జగన్ ఇలా షాకిచ్చాడు..

Update: 2019-06-08 05:20 GMT
10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పాలనలో తనదైన ముద్రను చూపిస్తున్నారు. అంతేకాదు సామాజిక కోణంలోనూ తనను సీఎం సీట్లో కూర్చుండబెట్టిన ఆయా వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు. అందుకే పార్టీ కోసం ఎంతో పోరాడి.. అండగా నిలిచిన రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవుల కేటాయింపుల విషయంలో జగన్ దూరం పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. జగన్ రెడ్లకు ప్రాధాన్యం ఇస్తే దుమ్మెత్తి పోద్దామని ఎదురుచూసిన ఎల్లో మీడియా, టీడీపీకి జగన్ ఆ చాన్సే లేకుండా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

జగన్ తన కేబినెట్ లో వ్యూహాత్మకంగా తనను అఖండ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడ్డ బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చాడు. ఏకంగా బీసీలకు ఏడు మంత్రి పదవులు ఇచ్చి వారే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పకనే చెప్పారు. ఇక ఆ తర్వాత ఎస్సీలకు ఐదు మంత్రి పదవులు, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. వైశ్య, కమ్మ, క్షత్రియ, ఎస్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చారు.

అగ్రవర్ణాలైన రెడ్లు, కాపులకు కేవలం 4 చొప్పున మంత్రి పదవులు ఇచ్చి వారిని కంట్రోల్ చేశారు. రోజా, ధర్మానా, భూమన, ఆనం రాంనారాయణ రెడ్డి లాంటి ఉద్దండులైన రెడ్డి, వెలమ సామాజికవర్గం ఉన్నా.. జగన్ సామాజిక సమీకరణాల కోసం వారిని మంత్రి పదవులకు దూరం పెట్టడం నిజంగా సాహసోపేతమైన చర్యగా అభివర్ణించవచ్చు. మోహమాటానికంటే.. అణగారిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడమే జగన్ తీసుకున్న గొప్ప స్టెప్ గా అభివర్ణిస్తున్నారు.

ఇప్పటికే జగన్ పేషీలో.. అధికారుల నియామకంలో రెడ్లకు ప్రాధాన్యం అని ఎల్లో మీడియా, టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఇక పార్లమెంట్ పదవుల్లోనూ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలకు పదవులు ఇవ్వగానే ఎల్లో మీడియా రెచ్చిపోయింది. అందుకే జగన్ తన సామాజికవర్గానికి మంత్రి పదవుల్లో కోత పెట్టి ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయడం విశేషం.

   

Tags:    

Similar News