నాడు కోట్ల‌పై ఎన్టీఆర్‌!.. నేడు బాబుపై జగ‌న్‌!

Update: 2019-02-07 16:13 GMT
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో గెలుపుపై ధీమాగానే ఉన్నారు. ఓ వైపు చాన్నాళ్ల క్రిత‌మే తాను ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కాపీ కొడుతున్నా... జ‌గ‌న్ ఏమాత్రం ఆందోళ‌న‌కు గురి కావ‌డం లేదు. చంద్ర‌బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా... ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం మాత్రం త‌న‌నే వ‌రిస్తుంద‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు. తాను ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే ఇచ్చే హామీల‌ను చంద్ర‌బాబు కాపీ కొట్ట‌ర‌ని అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితిలో అయితే జ‌గ‌న్ లేర‌నే వాద‌నే వినిపిస్తోంది. ఈ మేర‌కు నేడు క‌డ‌ప జిల్లాలో త‌టస్థుల‌తో జ‌రిగిన భేటీ సంద‌ర్బంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. నిన్న తిరుప‌తి కేంద్రంగా స‌మ‌ర శంఖారావం పేరిట వ‌రుస ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టిన జ‌గ‌న్‌... నేడు త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో శంఖారావం స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు. త‌న ప‌థ‌కాల‌ను కాపీ కొట్టినా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెల‌వ‌లేర‌ని, త‌న‌కు ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెట్ట‌బోతున్నార‌ని కూడా ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ సందర్భంగా జ‌గ‌న్‌ ఓ చిన్న లాజిక్ ను కూడా ప్ర‌స్తావించారు. ఇద్ద‌రు దివంగ‌త ముఖ్య‌మంత్రుల పేర్ల‌ను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... వారిలో ఒక‌రు ప్ర‌క‌టించిన ప‌థ‌కాన్ని కాపీ కొట్టేసిన ఇంకొక‌రు ఘోరంగా ఓట‌మిపాలయ్యార‌ని చెప్పారు. మ‌రొక‌రు ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్వేయంగా ప‌నిచేసి ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చూర‌గొని బంప‌ర్ మెజారిటీతో గెలిచార‌ని పేర్కొన్నారు. వారిలో ఓడిన నేత‌ మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి కాగా... గెలిచిన నేత టీడీపీ వ్య‌వస్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు. నాటి ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌... నాడు విప‌క్షంలో ఉన్న ఎన్టీఆర్ కిలో బియ్యాన్ని రూ.2ల‌కే ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. అయితే అప్పుడు సీఎంగా ఉన్న కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి... ఎన్టీఆర్ హామీని కాపీ కొట్టేసి... తాను కిలో బియ్యాన్ని రూ.1.90 ల‌కే ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇద్ద‌రి హామీల‌ను విన్న జ‌నం మాత్రం ఎన్నిక‌ల్లో మోస‌పూరిత హామీలిచ్చిన కోట్ల‌కు గ‌ట్టిగానే బుద్ధి చెబుతూ... హామీ ఇస్తే అమ‌లు చేసి తీర‌తార‌న్న న‌మ్మ‌కంతో ఎన్టీఆర్‌కు బంప‌ర్ మెజారిటీ ఇచ్చార‌ని గుర్తు చేశారు.

ఈ లెక్క‌న గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో లెక్క‌లేనన్ని హామీలిచ్చిన చంద్ర‌బాబు... వాటిలో ఎన్ని హామీల‌ను అమ‌లు చేశార‌ని ప్ర‌శ్నించారు. ఇచ్చిన హామీల‌న్నింటినీ విస్మ‌రించి నాలుగున్న‌రేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగార‌ని మండిప‌డ్డారు. అయితే ఎన్నిక‌లు ఆరు నెల‌ల్లో రానుండ‌గా... మ‌ళ్లీ  గెల‌వాల‌న్న కాంక్ష‌తోనే అబ‌ద్ధ‌పు హామీల‌తో పాటు తాను ఇచ్చిన హామీల‌ను కూడా కాపీ కొట్టేందుకు కూడా వెనుకాడటం లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం నాలుగున్న‌రేళ్ల పాటు గుర్తుకు రాక‌పోగా... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు నోట సంక్షేమం మాట వినిపిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. నాలుగేళ్ల పాటు త‌న‌దైన అవినీతి పాల‌న‌ను సాగించిన చంద్ర‌బాబు జిమ్మిక్కుల‌ను మ‌రోమారు న‌మ్మే ప‌రిస్థితిలో జ‌నం లేర‌ని, సంక్షేమ పాల‌నను ఎవ‌రు అందిస్తార‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఉంద‌ని, ఈ క్ర‌మంలోనే తాను గెల‌వ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎన్టీఆర్‌, కోట్ల‌ల‌ను గుర్తు చేసిన జ‌గ‌న్‌... నాడు ప్ర‌జ‌ల తీర్పును నేటి ప్ర‌జ‌ల తీర్పుతో పోల్చి చూపారు. హామీలు ఇచ్చి ఎన్నిక‌ల్లో గెలిచి వాటి అమ‌లును మ‌రిచే చంద్రబాబు లాంటి నేత‌ల‌ను జ‌నం ఒక‌సారి మాత్ర‌మే న‌మ్ముతార‌ని, నిత్యం న‌మ్ముతూ న‌ట్టేట మునిగేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్న అర్థం వ‌చ్చేలా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో స‌రికొత్త ప్ర‌సంగం చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News