కరోనా ఎఫెక్ట్: ఊడిన ప్రధాని పదవి

Update: 2021-09-03 16:30 GMT
కరోనా ఎఫెక్ట్ కు మరో వికెట్ రాలింది.. జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా కల్లోలాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నానని.. ఈ పాలన భారాన్ని తట్టుకోలేకపోతున్నట్టు ప్రకటించి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ఈనెల చివరి వారంలో జరిగే అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు జపాన్ ప్రధాని యోషిహిడే ప్రకటించారు. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.
 
జపాన్ కు కొత్త ప్రధాన మంత్రి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో కొత్త ప్రధానిని ఎంపిక చేసి పూర్తి చేస్తారని తెలుస్తోంది.

ఏడాది క్రితమే యోషిహిడే సుగ జపాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కంటే ముందు పనిచేసిన షింజో అబే అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో సుగను పార్టీ నేతలు ఎన్నుకున్నారు.

అయితే జపాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో యోషిహిడే సుగ విఫలమయ్యారు. ఫలితంగా ఆయన అప్రూవల్ రేటింగ్ పడిపోయింది. దీంతో ఇక పదవిలో కొనసాగకూడదని సుగ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి తాను ప్రధాని పదవికి పోటీచేసేది లేదని తేల్చిచెప్పారు.

ప్రధాని పదవిలో పరిగెత్తడానికి.. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి విపరీతమైన శక్తి అవసరం అవుతుందని.. ఆ శక్తి తనకు లేదని అంగీకరించిన సుగ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.  మరో నాయకుడిని ఎన్నుకోవాలని సంకేతాలను పార్టీకి పంపారు.

ప్రస్తుతం జపాన్ ప్రధాని రేసులో విదేశాంగ శాఖ మాజీ మంత్రి కిషిదా, తోపాటు సనాయి టకాయిచి, షిగెరు ఇషిబా పేర్లు తెరమీదకు వచ్చాయి.  ఇక అధికార పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు సనాయి టకాయిచి పేరు ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News