శ్రీకాళహస్తి : పవన్ కళ్యాణ్ పర్యటన లో ఉద్రికత్త !

Update: 2020-12-04 09:15 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. తాజాగా ఆయన పర్యటనలో ఉద్రిక్తత తలెత్తింది. రైతులను పరామర్శించేందుకు పొయ్య గ్రామానికి పవన్ వెళ్లారు. అయితే గ్రామంలోకి పవన్‌‌ను రానీయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది.

చిత్తూరు జిల్లా పర్యటను ముగించుకుని పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట చేరుకుంటారు. అక్కడ రైతులను కలిసి పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు.. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు. శనివారం రాపూరు, వెంకటగిరిలలో పర్యటనలు సాగనున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.

ఏపీలో ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా రాయలసీమలోని చిత్తూరు, కోస్తాంధ్రలోని నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు బాగా నష్టపోయాయి. దీంతో రైతులను ఆదుకోవాలని కోరుతూ, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు పవన్ ఈ పర్యటన చేపట్టారు. డిసెంబర్ 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. అక్కడ పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట పొలాలను పరిశీలించారు. అనంతరం డిసెంబర్ 3న చిత్తూరులో పవన్ పర్యటించారు. అక్కడ జనసేన నేతలతో సమావేశమై పంట నష్టం లెక్కలను తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు కనీసం రూ.25వేల నుంచి రూ.30వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అత్యవసరంగా కనీసం రూ.10వేల సాయం అందించాలని కోరారు. రైతులకు లాభసాటి ధర సాధనే జనసేన లక్ష్యం అని చెప్పారు.
Tags:    

Similar News