అర్థరాత్రి వేళ.. ఎంత హడావుడి

Update: 2015-07-29 19:14 GMT
వందలాది మంది ప్రాణాలు తీసిన యాకూబ్ మెమన్ కు అత్యున్నత న్యాయస్థానం విధించిన ఉరిశిక్ష అమలులో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలు చూసినప్పుడు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.

ఒక కరుడు గట్టిన నేరస్తుడికి దాదాపు23 సంవత్సరాల పాటు విచారణ జరిగి శిక్ష విధిస్తుంటే.. చోటు చేసుకుంటున్న హడావుడి చూసినప్పుడు..  ఈ దేశంలో తప్పు చేసి శిక్ష విధించటం కూడా ఒక సంచలనమేనా? అనిపించక మానదు.

యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుకు సంబంధించి అత్యున్నత స్థాయి వ్యక్తులు గంటల తరబడి సమావేశాలు నిర్వహించటం గమనార్హం. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష ను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో.. అతగాడి క్షమాపణ పిటీషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోవటానికి రాష్ట్రపతి భవన్ కు కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ దాదాపు 2.30 గంటలు సమావేశం కావటం గమనార్హం.

ఈ అంశంపై రాష్ట్రపతి.. సాలిసిటర్ జనరల్ సలహాను కూడా అడిగారు. ఇంత జరిగిన తర్వాత.. చివరకు 10.45 గంటల సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేయాలని.. అతను పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరిస్తూ.. రాష్ట్రపతి ప్రణబ్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు. మెమన్ కు ఉరిశిక్ష అమలు చేస్తున్న నేపథ్యంలో నాగపూర్ పట్టణం మొత్తం 144 సెక్షన్ విధించారు.

నాగపూర్ జైలు పరిసరాల్లో ఎవరూ సంచరించరాదని ఆంక్షలు విధించారు. ఇక.. ముంబయిలోని పోలీసు ఉన్నతాధికారులంతా రాత్రివేళ సమావేశం అయ్యారు. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయేమోనన్న భావనతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదికి సంబంధాలు ఉన్న యాకూబ్ మెమన్ ను ఉరి తీయటానికి ఎంత హడావుడో చూశారా?
Tags:    

Similar News