మాజీ నేత కోసం ప‌వ‌న్ సిఫార్సు చేస్తారా?

Update: 2020-10-30 03:45 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రితో ఎలాంటి అవ‌స‌రం వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి! అందుకే.. పార్టీలు మారినా.. చాలా మంది లౌక్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. తొంద‌ర‌పడి.. తాము ఫిరాయించిన పార్టీల‌పై ప‌న్నెత్తు మాట అనేందుకు సాహ‌సించ‌రు. గ‌తంలో క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక‌.. అనూహ్యంగా 2017లో టీడీపీకి మ‌ద్ద‌తంటూ రాగాలు తీశారు. కండువా క‌ప్పుకోక పోయినా.. చంద్ర‌బాబు పాల్గొన్న కార్య‌క్ర‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేశారు. కానీ.. ఎక్క‌డా ఆమె త‌న‌కు టికెట్ ఇచ్చి గెలిపించిన‌.. వైసీపీపై కానీ, జ‌గ‌న్‌పైకానీ ఒక్క మాట కూడా అన‌లేదు. నిజానికి చంద్ర‌బాబు నుంచి ఆపార్టీ నేత‌ల నుంచి వైసీపీపై విమ‌ర్శ‌లు చేయాల‌ని ఒత్తిడి వ‌చ్చినా.. ఆమె జాగ్ర‌త్త వ‌హించారు.

త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరిపోయారు. ఇదీ.. లౌక్యం అంటే.! ఇప్పుడు ఇదే లౌక్యంతో త‌న పాత పార్టీ అధినేత‌ను మేనేజ్ చేసుకుంటున్నారు మాజీ మంత్రి.. అతి త‌క్కువ కాలంలో ఎక్కువ పార్టీలు మారిన ఎస్సీ నాయ‌కుడు రావెల కిశోర్‌బాబు. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన రావెల కిశోర్‌బాబు.. పూర్వాశ్ర‌మంలో ఐఆర్ ఎస్ ఉద్యోగి. ఆయ‌న టీడీపీలోకి రావ‌డంతోనే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బాబుపై ఏపీ ప్ర‌జ‌ల‌కు ఉన్న ఊపులో గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, అదేస‌మ‌యంలో ఎస్సీ కోటాలో మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్నారు.

అయితే, అనూహ్య‌కార‌ణాల‌తో ఆయ‌న ఆ ప‌ద‌విని మ‌ధ్య‌లోనే పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక‌, గ‌త ఎన్ని క‌ల‌కు ముందు జ‌న‌సేన‌లోకి వ‌చ్చారు. టికెట్ తెచ్చుకున్నా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. అయితే, ఈ పార్టీలోనూ ఆయ‌న ఎక్కువ కాలం ఉండ‌లేక పోయారు. బీజేపీ తీర్తం పుచ్చుకున్నారు. అయితే, ఎక్క‌డా కూడా ఏ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఆ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం రావెల విష‌యంలో గ‌మ‌నించాల్సిన విష‌యం. స‌రే! ఇప్పుడు ఆయ‌న హైద‌రాబాద్‌లో మ‌కాం వేశార‌ట‌. త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ఈ ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌ఫున తాను పోటీకి దిగాల‌ని రావెల గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. కానీ, ఇదంత ఈజీకాదు. నిన్న‌గాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన రావెలకు టికెట్ ఇచ్చే సాహ‌సం బీజేపీ చేయ‌క‌పోవ‌చ్చు. పైగా పార్టీకి న‌మ్మ‌క‌మైన వారికే టికెట్ ఇచ్చే సంప్ర‌దాయం గ‌త కొంత‌కాలంగా సాగుతోంది. లేదంటే.. అధిష్టానం నుంచి నేరుగా టికెట్ తెచ్చుకునే సాహ‌స‌మైనా చేయాలి. కానీ, ఈ విష‌యంలో రావెల‌.. బీజేపీకి మిత్రుడు, త‌న పాత పార్టీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే బెట‌ర్ అనిభావించిన‌ట్టున్నారు. తిరుప‌తి ఎంపీ టికెట్ విష‌యంలో ప‌వ‌న్ సిఫార‌సు కోసం రావెల ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఎలాగూ.. బీజేపీ-జ‌న‌సేన‌ రెండు పార్టీలూ క‌లిసే ఇక్క‌డ పోటీ చేయాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల త‌ర‌ఫున త‌న పేరును సూచించేలా రావెల ఇప్ప‌టి నుంచే చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ప‌వ‌న్ సిఫార‌సు చేస్తే.. దాదాపు రావెల‌కే టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News