వెయిటింగ్, వచ్చి నన్ను చంపేయండి ... ఆఫ్ఘన్ తొలి మహిళా మేయర్

Update: 2021-08-18 02:30 GMT
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో పాటు, ఆ దేశం పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రజలతో పాటు , ప్రజా ప్రతినిధులు కూడా ఆందోళన చెందుతున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో భాగమైన తమని తాలిబన్లు ప్రాణాలతో ఉండనివ్వరని భయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి మహిళా మేయర్ జరీఫా గఫారీ తాలిబన్లు తనని కచ్చితంగా చంపేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు.

తాలిబన్లు నాలాంటి వాళ్లను తప్పకుండా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నా. వారు వచ్చే వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. నాకు, నా ఫ్యామిలీకి సహాయం చేయడానికి ఎవరూ లేరు. నేను నా భర్త, కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నాను. తాలిబన్లు నాలాంటి వారి కోసం వెతుకుతున్నారు కావచ్చు. అందుకే నేను నా కుటుంబాన్ని వదిలి వెళ్ళలేను. అయినా నేను ఎక్కడికి వెళ్లగలను అని ఆవేదన వ్యక్తం చేశారు.

2018 లో ఈమె మైదాన్ వర్దాక్ ప్రావిన్స్ తొలి మహిళా మేయర్ గా ఎన్నికైంది. చిన్న వయస్సులోనే ఈ పదవికి ఎన్నికైనందుకు నాడు అంతా ఈమెను ప్రశంసించారు. అయితే బహుశా ఇందుకు ఆమెకు తాలిబన్ల నుంచి బెదిరింపులు అందాయి. ఈమె తండ్రి జనరల్ అబ్దుల్ వాసి గఫూర్ ని వారు గత ఏడాది నవంబరు 15 న కాల్చి చంపారు. ఈమెను కూడా హతమార్చడానికి మూడో సారి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఈమె తండ్రిని వారు టార్గెట్ చేశారు.

కాబూల్ లో జరిగే ఉగ్రదాడుల్లో గాయపడిన పౌరులు, సైనికుల సంక్షేమానికి జరీఫా కృషి చేస్తూ వచ్చింది.మూడు వారాల కృతమే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, నేటి పరిణామాల గురించి యువతకు అంతా తెలుసునని, వారికి సోషల్ మీడియా వంటివి ఉన్నాయని, తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో వారికి మంచి అవగాహన ఉందని తెలిపింది. ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉందని ఎంతో ఆశాభావంతో వ్యాఖ్యానించింది. కానీ ఆమె ఆశలన్నీ నీరుగారిపోయాయి. ప్రస్తుతం నిస్సహాయంగా ఉన్న జారీఫా గఫారీ తన లైఫ్ గురించి, తన కుటుంబ సంక్షేమం గురించి తీవ్ర ఆందోళన చెందుతోంది. తాలిబన్లు కాబూల్‌ను కూడా ఆక్రయించడంతో తన చావు తప్పదని భయపడుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

గత ఆఫ్ఘన్ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులపై లేదా అధికారులపై ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ.. వారిని నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరు. తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో మహిళలు చాలా ఎక్కువగా భయపడుతున్నారు. గతంలో తాలిబన్లు మహిళల విద్యను నిలిపివేయడంతో పాటు.. వారిని ఉద్యోగాల నుంచి నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి అనాగరిక శిక్షలు విధించారు. దాంతో దేశవ్యాప్తంగా మహిళలు వణికిపోతున్నారు.




Tags:    

Similar News