అక్కడ వైసీపీకి కాపు కాసే నేతలే లేరా ...?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి.;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బలు వరుసగా తగులుతున్నాయి. జిల్లా రాజకీయాలను శాసించే ప్రధాన సామాజిక వర్గమైన కాపు సామాజిక నేతలు పార్టీకి దూరం అవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం అండతోనే క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ, ఇప్పుడు అదే వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. జిల్లాలోని పలువురు కీలక మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా, ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామం జిల్లా వైసీపీ క్యాడర్ లో ఆందోళన నింపుతోంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎంత ప్రయత్నించినా స్థానిక నేతల మధ్య ఉన్న విబేధాలు, సామాజిక సమీకరణాలు అడ్డంకిగా మారుతున్నాయి.
ముఖ్యంగా పార్టీ అగ్ర నాయకత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు జిల్లాలోని కాపు నాయకులకు మింగుడు పడటం లేదు. తమకు సరైన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి వారిలో బలంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతలను కాదని, కొందరు వ్యక్తులకే పార్టీ పగ్గాలు అప్పగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల వైసీపీ జిల్లా నాయకత్వం తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అసంతృప్త నేతలను బుజ్జగించడానికి పార్టీ పెద్దలు రంగంలోకి దిగినా ఫలితం ఆశాజనకంగా లేదు. పలువురు నేతలు ఇప్పటికే కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. జనసేన లేదా తెలుగుదేశం పార్టీల్లో చేరిపోతున్నారు.
గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. 2019 ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంక్ వైసీపీ వైపు నిలబడటంతో జిల్లాలో తిరుగులేని విజయం సాధ్యమైంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాలు పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. పవన్ కళ్యాణ్ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండటం కూడా వైసీపీ నేతలు పార్టీ వీడటానికి ఒక కారణం అని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాపు నేతలు అందరూ ఇప్పుడు అస్సలు పార్టీ జెండా మోసేందుకు కూడా ఎంత మాత్రం ఇష్టపడడం లేదు. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా అయోమయంలో ఉంది. బలమైన సామాజిక వర్గం మద్దతు కోల్పోతే భవిష్యత్తులో జిల్లాలో పార్టీ మనుగడ కష్టమని స్థానిక వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు జిల్లాలో కాపు నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి లేదా ఉన్నవారిని నిలబెట్టుకోవడానికి అధిష్టానం కూడా పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. పార్టీ అధినేత నేరుగా జోక్యం చేసుకోవడంతో పాటు కాపు సామాజిక వర్గంలో చక్రం తిప్పే నేతలను ఆకర్షించకపోతే ఈ రెండు జిల్లాలలో వైసీపీ పుంజుకునే ఛాన్సులు అయితే లేవు. అందుకే పార్టీలో ఉన్న కాపు నేతలు, ఈ వర్గంలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనతోనే ఉన్నారని పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తోన్న టాక్ ?