దసరాకు టార్గెట్ తప్పని తూటాలు రెఢీ ఖాయమట

Update: 2020-07-18 05:00 GMT
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తనకు తిరుగులేదన్నట్లుగా చెలరేగిపోతున్న వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో భారత్ టాప్ త్రీ ప్లేస్ కు చేరిపోయింది. రోజులు గడిచే కొద్దీ కేసుల తీవ్రత మరింత పెరగటమే కాదు.. ముప్పు కూడా పెరిగే పరిస్థితి. ఇలాంటివేళ.. వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేదెప్పుడు అన్న దానిపై తాజాగా మరో క్లారిటీ వచ్చింది. ఫేస్ బుక్  వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తో జరిగిన లైవ్ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ఆంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ భరోసా ఇచ్చే మాటల్ని చెప్పారు.

ఆన్ లైన్ ఇంటర్వ్యూలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ మీద చేపట్టిన క్లీనికల్ ట్రయల్స్ కొలిక్కి రావటమే కాదు.. కరోనాను ఎదుర్కొనేందుకు కచ్ఛితమైన తూటాల్ని డెవలప్ చేసే అవకాశం ఉందన్నారు. ‘వైరస్ బారిన పడి కోలుకున్న వారి శరీరాల నుంచి సేకరించిన యాంటీ బాడీల ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు కచ్ఛితమైన తూటాల్ని అభివృద్ధి చేయొచ్చన్నారు. మోనోక్లోనల్ యాంటీబాడీల మీద ప్రయోగాలు సెప్టెంబరు నాటికి తుది ఫలితాలు వచ్చే వీలుందని చెబుతున్నారు.

టార్గెట్ తప్పని బుల్లెట్ల మాదిరి వీటిని నరాలకు ఎక్కించి నేరుగా శరీరంలోకి పంపొచ్చు. వివిధ దశల్లో ఉన్న వ్యక్తుల్ని ఈ యాంటీబాడీల సాయంతో వైరస్ నుంచి రక్షించొచ్చన్నారు. కరోనా తీవ్ర లక్షణాలు ఉన్న వ్యక్తి.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా చేసే మందులు ఇప్పుడు చాలా అవసరమన్న ఫౌచీ.. అజాగ్రత్తతోనే యూత్ ఎక్కువగా పాజిటివ్ బారిన పడుతున్నట్లు చెప్పారు. మొత్తంగా శుభవార్త దగ్గరకు వచ్చినట్లే చెప్పాలి. మరి..ఆ రోజుకు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో? 
Tags:    

Similar News