పవార్ పెద్దరికం నిలుస్తుందా?

Update: 2022-09-23 02:30 GMT
సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పెద్ద బాధ్యతనే భుజనేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని కొందరు సీనియర్ నేతలు గట్టిగా అనుకుంటున్నారు. అయితే అనుకుంటున్న వాళ్ళంతా ప్రాంతీయపార్టీల అధినేతలే. వీరిలో శరద్ పవార్, మమతాబెనర్జీ, నితీష్ కుమార్, కేసీయార్, అఖిలేష్ యాదవ్ ముఖ్యులని చెప్పాలి. అయితే వీళ్ళ పార్టీలకు జాతీయస్ధాయిలో వాళ్ళ రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా బలంలేదు

బలమైన బీజేపీని ఎదుర్కోవాలంటే మరో బలమైన జాతీయపార్టీ చాలా అవసరం. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీలేదు. అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపి పనిచేయటానికి మమతాబెనర్జీ, కేసీయార్ లాంటి వాళ్ళు సిద్ధంగా లేరు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తనకు అవసరమైనపుడు మాత్రమే కాంగ్రెస్ తో మమత కలుస్తున్నారు. మిగిలిన సమయాల్లో మాత్రం కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నారు. మమత లేకుండా బలమైన ప్రత్యామ్నాయం సాధ్యంకాదు.

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్-మమత మధ్య సయోధ్య చేసేందుకు పవార్ బాధ్యత తీసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరాన్ని పవార్ బెంగాల్ సీఎంకు చెప్పారు. అనేక మంతనాలు జరిగిన తర్వాత చివరకు కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి మమత అంగీకరించారట. ఈ విషయాన్ని పవార్ ప్రకటించారు. కాంగ్రెస్ తో ఉన్న ఇబ్బందులను సరిచేసుకుని అడుగులు ముందుకేయాలని మమత అంగీకరించారని పవార్ చెప్పారు.

పవార్ ప్రయత్నాలు బాగానే ఉన్నాయికానీ మమతను ఎంతవరకు నమ్మచ్చన్నదే అసలైన సమస్య. ఎందుకంటే మమత ఎంతమాత్రం నమ్మదగ్గ నేతకాదని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఏరోజు ఎలాగుంటారో ? ఏరోజు ఎవరితో చేతులు కలుపుతారో కూడా ఎవరు ఊహించలేరు.

మధ్యవర్తిత్వం వహించినందుకు చివరకు పవార్ బకరా అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పవార్ కూడా సీనియర్ నేతే అయినా మమత దూకుడు ముందు తట్టుకోలేరు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News