మీడియాకు ముఖం చాటేసిన పవన్..కారణమిదేనా?

Update: 2019-04-13 08:00 GMT
ఏపీలో సార్వత్రిక పోలింగ్‌ ముగిసినా రాజకీయ చర్చలు అలాగే సాగుతున్నాయి. ఎన్నికల ముందు బహిరంగంగా పార్టీ నాయకులు ప్రసంగాలతో జనం మధ్యకు వెళ్లగా.. ఇప్పడు ఎక్కడికక్కడనేతలు పోలింగ్‌ సరళిపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేనలు హోరాహోరీగా తలపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ప్రచారం చేసుకున్న చంద్రబాబు పోలింగ్‌ తరువాత తనదే విజయం అంటూ సంకేతాలిచ్చారు. ఇక ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, టీడీపీపై వ్యతిరేకత వచ్చిందని పోలింగ్‌ ను బట్టి చూస్తే అర్థమయిందని జగన్‌ మీడియా ముందుకు వచ్చి చెప్పారు.

అయితే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇంతవరకు ఎక్కడా సమావేశం నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. ఎప్పుడు ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యే పవన్‌ ఈసారి ఆ వైపు నుంచి కూడా ఒక్క మెసేజ్‌ పెట్టలేదు. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించిన పవన్‌ పోలింగ్‌ తరువాత సైలెంట్‌ కావడంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. మిగతా పార్టీల నాయకులు మీడియా ముందుకు వచ్చి పోలింగ్‌ గురించి మాట్లాడగా పవన్‌ కనీసం ఈసీని కూడా విమర్శంచకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనెల 11న పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఆయా జిల్లాల నుంచి పవన్‌ నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఫ్యాన్స్‌ తో పాటు ఎక్కువగా కాపు సామాజిక వర్గంపై ఆధారపడిన పవన్‌ ఆ వ్యూహం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కాపు ఓట్లు అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలపై పవన్‌ ఎక్కువగా దృష్టి సారించారు. గత ఎన్నికల్లో టీడీపీ వైపు మళ్లిన కాపు సామాజిక వర్గం ఈసారి పవన్‌ కు మద్దతిస్తారని అనుకున్నారు. అయితే టీడీపీపై వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవమే కానీ పవన్‌ వైపు కాపు సామాజికవర్గం చూడలేదని నివేదికల ద్వారా తెలుస్తోంది.

దీంతో తాను అనుకున్న సీట్లు వచ్చే అవకాశం ఉందో లేదోనన్న డైలామాలో పడ్డాడట పవన్‌. అందుకే ఇప్పుడే మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా తాను కొన్ని సీట్లలోనైనా గెలుస్తానని కచ్చితంగా చెప్పలేకుండా ఉన్నాడట. అందుకని ఇప్పుడు ఏదో గొప్పలు చెప్పి ఫలితాల్లో నిరాశ ఎదురైతే పరువు పోతుందన్న ఆలోచనతో మీడియా కంటపడకుండా ఉంటున్నాడట. ఒక రకంగా పవన్‌ సర్వేలు, నివేదికలను నమ్ముకోకుండా ఫలితాలపై ఆధారపడడం సబబే కానీ మీడియా కంటపడకుండా ఉండేసరికి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వాదనలను పవన్‌ ఏ విధంగా తిప్పికొడుతాడో చూడాలి.


Tags:    

Similar News