బాబుకు ప‌రువు స‌మ‌స్య‌

Update: 2016-04-17 06:11 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ మ్యాచ్‌ లు విశాఖలో నిర్వహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర లో  నెలకొన్న తీవ్ర నీటి కరవు నేపథ్యంలో కొన్ని మ్యాచ్‌ లను విశాఖ వేదికగా నిర్వహించేందుకు ఐపిఎల్ కసరత్తు చేస్తోంది. ఐపిఎల్ ఫ్రాంచైజీలు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ - ముంబై ఇండియన్స్ జట్లు తమ సొంతగడ్డ మహారాష్టల్రో మ్యాచ్‌ లు ఆడేందుకు అక్కడి న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్ర‌జ‌ల అవసరాలను పక్కనపెట్టి క్రికెట్ మ్యాచ్‌ ల నిర్వహణకు నీటిని మళ్లించడం కంటే మ్యాచ్‌ లను మరోచోటికి తరలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నాగ్‌పూర్ - పుణె - ముంబై నగరాల్లో జరగాల్సిన మ్యాచ్‌ లను ప్రత్యామ్నాయ వేదికలకు తరలించేందుకు ఐపిఎల్ నిర్వాహకులు సిద్ధపడ్డారు. ఇందులోభాగంగా పుణె సూపర్ జైంట్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ లను విశాఖలో నిర్వహించేందుకు నిర్ణయించారు.

పుణె జట్టు విశాఖలో నాలుగు మ్యాచ్‌ లు - ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌ లు ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. అన్నీ సవ్యంగా జరిగితే రెండు జట్లు విశాఖలో ఆరు మ్యాచ్‌ లు ఆడేందుకు వీలుగా ఐపిఎల్ సన్నాహాలు చేస్తోంది. విశాఖలో ఐపిఎల్ మ్యాచ్‌ లు జరుగుతాయని సంతోషిస్తున్న క్రికెట్ అభిమానులు తాజాగా నీటి సరఫరా వివాదం రాజుకోవడంతో ఈ మ్యాచ్‌ లు ఎక్కడ రద్దవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.

విశాఖ ప్రజానీకం ఇప్పటికే మంచినీటి కొరత ఎదుర్కొంటోంది. నగరానికి ప్రధాన మంచినీటి వనరు గోదావరి - ఏలేశ్వరం. ఇక్కడి నుంచి పంపింగ్ ద్వారా నీటిని నగరానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి రెండు పంపుల ద్వారా 100 క్యూసెక్కులు - ఏలేశ్వరం నుంచి ఒక పంపు ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విశాఖ తరలిస్తున్నారు. ఈ నీటిలో అత్యధికంగా స్టీల్‌ ప్లాంట్ సహా ఇతర పారిశ్రామిక అవసరాలకే మళ్లిస్తున్నారు. నగర మంచినీటి అవసరాలకు 62 ఎంజిడిల నీరు అవసరం. ప్రజల తాగునీటి అవసరాలను ప్రస్తుతం రైవాడ - తాటిపూడి - మేహాద్రిగెడ్డ - ముడసర్లోవ రిజర్వాయర్లు తీరుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐపిఎల్ మ్యాచ్‌ లకు నీటి సరఫరా అంశం విమర్శలకు తావిస్తోంది.
Read more!

భవిష్యత్ అవసరాలను విస్మరించి ఐపిఎల్ మ్యాచ్‌ లకు నీటి సరఫరాపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఐపిఎల్ మ్యాచ్ నిర్వహించాలంటే రోజుకు 3 లక్షల లీటర్ల నీరు అవసరమని, ఆరు మ్యాచ్‌ ల నిర్వహణకు 18 లక్షల లీటర్ల నీరు వృథా చేయడం ప్రజావసరాలను విస్మరించడమేనని పేర్కొంటున్నాయి. ఇదే అంశంపై ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్ - విశ్రాంత ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. మ్యాచ్‌ ల నిర్వహణ వల్ల నగరంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మొండిగా వ్యవహరించి మ్యాచ్‌ ల నిర్వహణకు సిద్ధపడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. విశాఖలో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ లు నిర్వహించినప్పటికీ ఎటువంటి నీటి ఇబ్బందులు ఉండవని జివిఎంసి నీటి సరఫరా విభాగం చెప్తోంది. గ్రౌండ్ నిర్వహణ - ఇతర అవసరాలకు ఎసిఎ - విడిసిఎ స్టేడియంలో బోర్ల నీరు సరిపోతుందని, తాగునీటి అవసరాల కోసం మ్యాచ్ జరిగే రోజున 50 నుంచి 60 వేల లీటర్ల నీటిని మాత్రమే జివిఎంసి సరఫరా చేస్తుందన్నారు. ఇది పెద్ద ఇబ్బందికరమేమీ కాదన్నారు.
Tags:    

Similar News