స్టాలిన్ త‌ర్వాత పుతినే...ర‌ష్యాలో రికార్డ్‌

Update: 2018-03-19 10:04 GMT
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నాలుగోదఫా ఎన్నికయ్యారు.  స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై ఆదివారం ముగిసింది. 74% ఓట్లను పుతిన్ సాధించనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్ వెల్లడించగా అంత‌కు మించి దాదాపు 76.67శాతం ఓట్లను సాధించినట్లు రష్యా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. రష్యా వ్యాప్తంగా 10కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పుతిన్‌ తో పాటు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేశారు. న్యాయపరమైన కారణాలతో ప్రధాన ప్రత్యర్థి నావెల్ని పోటీ నుంచి తప్పుకున్నాడు.

దాదాపు రెండు దశాబ్ధాలుగా పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. 2000 నుంచి అధ్యక్షుడిగా - ప్రధానిగా రష్యాను పాలిస్తున్న పుతిన్‌ కు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు. ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీ ఖాయమని అనేక సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ఈ గెలుపుతో 2024 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొన‌సాగుతారు. తద్వారా స్టాలిన్‌ తర్వాత అత్యధికకాలం దేశ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా పుతిన్‌ రష్యా చరిత్రలో నిలిచిపోనున్నారు.

కాగా, ఇటీవల జరిగిన రెండు పరిణామాలు ఆయన ఇమేజ్‌ ను కొంత దెబ్బతీసాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకటి- బ్రిటిష్‌-రష్యా గూఢచారిపై విష రసాయన దాడి కాగా, రెండోది- 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తలదూర్చినందుకు ఆంక్షలు విధించడం. ప్రీ పోల్‌ సర్వేలో పుతిన్‌ కు 69.7 శాతం మద్దతు దక్కిందని వస్తే.. ఆయన సమీప ప్రత్యర్థి పావెల్‌ గ్రడినిన్‌ కు 7.1 శాతం మంది మాత్రమే ఓటేశారు. అయితే ఓటర్లలో ప్రస్తుతం ఆసక్తి తగ్గిందని, పోలింగ్‌ రోజు పుతిన్‌కు మద్దతు తగ్గవచ్చునని పాశ్చాత్య మీడియా వ్యాఖ్యానించింది.
Tags:    

Similar News