పెద్దన్న అహం మీద దెబ్బ కొట్టిన ఎంపీ

Update: 2016-08-27 04:59 GMT
కాలం మారుతుందన్న విషయాన్ని అమెరికా గుర్తించాల్సిన అవసరం వచ్చిందని చెప్పాలి. గతంలో మాదిరి భారత్ తో వ్యవహరిస్తే ఆ దేశానికి అవమానం తప్పదన్న విషయాన్ని ఇక గుర్తించక తప్పదు. అమెరికన్లు మన దేశానికి వస్తే వారికిచ్చే మర్యాద ఎంతన్నది తెలిసిందే. ఇక.. ఆ దేశం నుంచి ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవటం కనిపిస్తంది.

అదే సమయంలో మన దేశానికి చెందిన ప్రముఖులు అమెరికాకు వెళ్లినా రూల్స్ పేరిట తమ అహంకారాన్ని ప్రదర్శించే వైనం తెలిసిందే. అయితే.. అమెరికాకు వెళ్లే మన ప్రముఖుల మంచితనం కారణంగా అమెరికన్ల తరచూ తమ అహాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా అలాంటి ప్రయత్నం చేసిన అధికారులకు షాక్ ఇవ్వటమే కాదు.. తన వైఖరితో భారీ పంచ్ నే ఇచ్చారు బీజేపీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్.

తమ దేశంలో జరిగే రైతు సదస్సులో హాజరు కావాలంటూ వీరేంద్ర సింగ్ మస్త్ కు అమెరికా నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. ఆ దేశానికి వెళ్లేందుకు వీసా కోసం అమెరికా ఎంబసీకి వెళ్లారు. అయితే.. అక్కడ ఫోటోకి ఫోజు ఇవ్వటానికి తలపాగా తీయాలని కోరారు. తలపాగా తీయటాన్ని అవమానంగా భావించిన ఎంపీ కుదరదని చెప్పారు. దీనికి అధికారులు తలపాగా తీయాలని స్పష్టం చేయటంతో ఒళ్లు మండిన ఆయన.. తనకు అమెరికా వీసా అక్కర్లేదని చెప్పటమే కాదు.. తనకు తాను అమెరికాకు వెళ్లాలని అనుకోలేదని.. ఆ దేశమే తనకు ఆహ్వానం పంపిందన్న విషయాన్ని స్పష్టం చేశారు. అక్కడితో ఆగని ఆయన.. అమెరికా నుంచి తనకొచ్చిన ఆహ్వానాన్ని అక్కడి చెత్త బుట్టలో పడేసి.. తాను అమెరికాకు వెళ్లాల్సిన అవసరమే లేదంటూ తేల్చి చెప్పి ఎంబసీ నుంచి బయటకు వచ్చేశారు.

అమెరికా ఎంబసీలో తనకు జరిగిన అవమానాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పిన ఆయన నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వైఖరికి సరైన రీతిలో అధికారపక్ష ఎంపీ బుద్ధి చెప్పారన్న మాట పలువురి నోటి నుంచి రావటం గమనార్హం. తాజా ఘటనను చూస్తే అమెరికా కంటే ఆత్మగౌరవానికే ఎక్కువ విలువ ఇచ్చే వారు ఎక్కువ అయ్యారని.. గతంలో మాదిరి వ్యవహరిస్తే ఇలాంటి షాకులు తప్పవన్న విషయం పెద్దన్న అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చినట్లు కనిపించట్లేదు?
Tags:    

Similar News