సెహ్వాగ్ ట్వీట్లు పంచ్ లు పడుతూనే ఉన్నాయి!

Update: 2016-10-24 04:12 GMT
ఇంతకాలం మైదానంలో సెహ్వాగ్ దూకుడు తెలుసుకానీ.. రిటైర్మెంట్ తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్ దూకుడు ఈ మధ్యే కనిపిస్తోంది. ఒక్కసారి బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే ఊచకోతే తప్ప క్షమాబిక్ష ఉండదంటూ బౌలర్లపై విరుచుకుపడే వీరేంద్రుడు, ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లోనూ తనదైన కట్ షాట్లు - స్క్వేర్ డ్రైవ్ లు కొన్నిసార్లు ఫుల్ షాట్లతో చెలరేగిపోతున్నాడు. ఈ విషయంలో బ్రిటీష్ జర్నలిస్ట్ ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతున్నాడు.

రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన బ్రిటీష్‌ జర్నలిస్ట్‌ పై అప్పట్లో సెటైర్లు - పంచ్ ల యుద్ధం చేసిన సెహ్వాగ్‌.. మరోసారి తనదైన శైలిలో అతనిపై చమత్కార బాణాన్ని వదిలాడు. ఈసారి అలా ఇలా కాదు, నేరుగా వెళ్లి తగిలేలా... తగిలా చెప్పుకోలేని పరిస్థితి అతనికి కలిగేలా!!

అహ్మదాబాద్‌ లో జరిగిన ప్రపంచకప్‌ కబడ్డీ ఫైనల్లో ధమ్ము చూపించిన భారత్ ఆటగాళ్లు ఇరాన్‌ ను ఓడించి విశ్వ విజేతగా భారత్ ను నిలిపారు. ఈ విజయంపై భారత్ కబడ్డీ జట్టును అంతా ప్రశంసిస్తుంటే... ఆపని పూర్తైన తర్వాత సెహ్వాగ్‌ తన ట్విట్టర్ ప్రత్యర్ధి బ్రిటీష్ జర్నలిస్ట్ కు తగిలేలా కొన్ని చురకలేశాడు. "కబడ్డీ పుట్టినిల్లు భారత్‌... వరుసగా ప్రపంచ విజేతగా నిలుస్తోంది. కానీ.. క్రికెట్‌ ను కనిపెట్టిన దేశం (ఇంగ్లాండ్‌) ఇంకా తమ ఆటను సరిదిద్దుకొంటూనే ఉంది" అని ట్వీట్‌ చేశాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌ ఒక ప్రపంచకప్‌ కూడా గెలవలేని సంగతి తెలిసిందే.
Read more!

దీంతో అడ్డగోలు వాదనకు దిగిన జర్నలిస్టు మోర్గాన్‌... "నిజం చెప్పాలంటే కబడ్డీ అసలు క్రీడే కాదని, బలమైన ఆటగాళ్లు వేదికపై తిరుగుతూ ఒకరినొకరు కొట్టుకునేదని సమాధానమిచ్చాడు. ఈ సమర్ధనకు మోర్గాన్ పరిస్థితిపై సెటైర్లు పడుతున్నాయి. అంతకుమించి ఏమనగలరులే అంటూ చురకలంటిస్తున్నారు నెటిజన్లు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News