ప‌ద‌విచ్చినా వెంక‌య్య ఎందుకు ఫీల్ అవుతున్నారు?

Update: 2017-07-24 17:30 GMT
సినిమా ఎంట్రీ బాగున్నా.. బాగోలేకున్నా.. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయి.. క్లైమాక్స్ ఇర‌గ‌దీసేలా ఉంటే.. సినిమా సూప‌ర్ హిట్ అయిన‌ట్లే. రీల్ ముచ్చ‌ట ప‌క్క‌న పెడ‌దాం. రియ‌ల్ లైఫ్ లోకి వ‌ద్దాం. విద్యార్థి ద‌శలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. కెరీర్ మొద‌ట్లో క‌ష్టాలు ఎదుర్కొన్నా.. మిడిల్ ఏజ్ వ‌చ్చేస‌రికి ఎంతోకొంత సాధించి.. ఆ త‌ర్వాత దూసుకెళ్లే నేత‌కు.. రాజ‌కీయాల నుంచి వైదొలిగే వేళ‌లో ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాల‌నుకోవ‌టం అత్యాశేం కాదు.

కానీ.. అలాంటి ఆశ‌లు తీర‌కుండానే.. క‌ళ్ల ముందు క‌ల క‌రిగిపోతుంటే బాధ ఉండ‌కుండా ఉండ‌దు. ఇదంతా ఎందుకంటే.. కేంద్ర‌మంత్రి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు కీల‌క‌మ‌ని చెప్పుకునే వెంక‌య్యను అప్రాధాన్య‌త ప‌ద‌విగా భావించే ఉప రాష్ట్రప‌తి పోస్ట్ ఇచ్చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిత్యం అంత్య ప్రాస‌ల‌తో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఘాటుగా విరుచుకుప‌డే వెంక‌య్య‌కు ఇక‌పై అలాంటి అవ‌కాశం లేని రీతిలో.. రాజ్యాంగ ప‌ర‌మైన ప‌ద‌విలో కూర్చోబెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టం వెంక‌య్య‌కు సైతం మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది.

ఈ క్ర‌మంలో త‌న మ‌న‌సులోని బాధ‌ను త‌న‌దైన శైలిలో మీడియా ముందు చెప్పుకున్నారు. పార్టీకి అన్నీ తానై న‌డిపిస్తున్న మోడీ నిర్ణ‌యాన్ని కాద‌న‌లేని వేళ‌.. మ‌న‌సులోని వేద‌న‌ను ఎంతోకొంత బ‌య‌ట‌పెట్టుకునే సాహ‌సం చేశారు వెంక‌య్య‌. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌విని స్వీక‌రించే విష‌యంలో వెంక‌య్య‌కున్న ఇబ్బందిని ఒక్క మాట‌లో చెప్పాలంటే.. తాజాగా రాష్ట్రప‌తిగా ఎన్నికైన కోవింద్ వెంక‌య్య కన్నా జూనియ‌ర్‌. అంతేనా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన రోజుల్లో  పార్టీకి సంబంధించిన ప‌ద‌విని కోవింద్‌ కు క‌ట్ట‌బెట్టారు వెంక‌య్య‌.

అలాంటి కోవింద్ కంటే త‌క్కువ స్థానంలో ఈ రోజు వెంక‌య్య ప‌ని చేయాల్సి రావ‌టాన్ని జీర్ణించుకోలేరు క‌దా. అందుకే.. ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి త‌న‌ను పార్టీ ఎంపిక చేసింద‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీని క‌లిసి త‌న వాద‌న‌ను వినిపిస్తాన‌ని చెప్పే ధైర్యం చేశారు వెంక‌య్య‌. నిజానికి పార్టీ వేరు.. మోడీ వేరు ఎంత మాత్రం కాదు.

పార్టీ నిర్ణ‌యం తీసుకుందంటేనే మోడీ నిర్ణ‌యం తీసుకున్నట్లు లెక్క‌. అయిన‌ప్పటికీ త‌న‌ను ఉప రాష్ట్రప‌తిగా ఎంపిక చేసినట్లుగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నిర్ణం వెల్ల‌డించిన త‌ర్వాత‌.. మీడియాతో మాట్లాడిన వెంకయ్య తాను ప్ర‌ధాని మోడీని క‌లిసి త‌న మ‌న‌సులోని మాట‌ను చెబుతాన‌ని చెప్ప‌టం చూస్తే.. వెంక‌య్య ఇన్న‌ర్ ఫీలింగ్స్ ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేయొచ్చు.

మ‌రికొన్నాళ్లు కేంద్రంలో చ‌క్రం తిప్పే ఛాన్స్ క‌ళ్ల ముందు క‌రిగిపోతుంటే.. తానెంతో మొన‌గాడిన‌న్న ఫీలింగ్‌ ను సింఫుల్ గా తీసి పారేసిన మోడీ తీరుకు వెంక‌య్య హ‌ర్ట్ కాకుండా ఉండ‌లేరు మ‌రి. అలా అని మోడీ నిర్ణ‌యాన్ని కాద‌న‌లేని ప‌రిస్థితి. అందుకే మ‌ధ్యేమార్గంగా మోడీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూనే.. త‌న మ‌న‌సులోని మాటను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు వెంక‌య్య‌. ఏమైనా త‌న సినిమా త‌నకే న‌చ్చ‌ని చిత్ర‌మైన ప‌రిస్థితుల్లో వెంక‌య్య ఉన్నార‌న‌టంలో మ‌రో మాట లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌వ‌ర్ ఫుల్ పొజిష‌న్లో ఉండి కూడా ప‌రిమితులు క‌ట్టి పారేయ‌టాన్ని ఎవ‌రు మాత్రం జీర్ణించుకోగ‌ల‌రు?
Tags:    

Similar News