అమరావతిపై కొత్త చ‌ర్చ మొద‌లైంది

Update: 2016-05-02 12:59 GMT
అమరావతి.. వెలగపూడి.. ఇంతకూ నవ్యాంధ్ర రాజధాని ఏది? అమరావతా? వెలగపూడినా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో సరికొత్తగా జరుగుతున్న చర్చ ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత, అక్కడి నిర్మాణాలకు అవుతున్న ఖర్చు - అదనపు నిర్మాణాల ఏర్పాట్లపై జరుగుతున్న కసరత్తు చూసిన వారికి... అమరావతి కాకుండా, వెలగపూడి శాశ్వత రాజధాని అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ - కేంద్రమంత్రుల స‌మ‌క్షంలో అమరావతి శంకుస్థాపన అట్టహాసంగా జరిగింది. అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావ‌స్తోంది. కానీ అమరావతిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను రైతులే గుర్తించలేనంతగా చదునుచేయడం, రైతులు భూములు ఇవ్వడం తప్ప - భవనాల కోసం ఒక్క ఇటుక కూడా అదనంగా నిర్మించిన దాఖలాలు లేవు.ఈలోగా పర్యావరణ పర్యరక్షణ నాశనం అవుతోందని పాత్రికేయుడొకరు గ్రీన్ ట్రైబ్యునల్‌ లో కోర్టు వేశారు. అది పెండింగ్‌ లోనే ఉంది. ఇంకా అటవీశాఖ నుంచి పూర్తి స్థాయి అనుమతులు రావలసి ఉంది. మరోవైపు భూకంపాలు - ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే శక్తి అమరావతికి లేదని నిపుణులు ఆందోళన మొదలుపెట్టారు. అమరావతిలో సింగపూర్ తరహాలో - ఆకాశంతో పోటీ పడే స్థాయిలో భవన నిర్మాణాలుంటాయని గ్రాఫిక్స్ ఊహాచిత్రాలను ప్రభుత్వం తొలిరోజుల్లో ఆవిష్కరించింది. తీరా చివరకు 17 - 18 అంతస్థులకే పరిమితం కావలసి ఉంటుందని తెలియడంతో, మళ్లీ నాటి ప్రచార తరహా ఆర్భాటం కనిపించలేదు.

అమరావతిపై గత రెండేళ్ల క్రితం చేసిన భారీ ప్రచారానికి, ఇప్పటి ప్రచారానికి పొంతనే లేదు. ఐదారు నెలల క్రితం వరకూ అమరావతి నిర్మాణంపై భారీ ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు అసలు ఆ ప్రచార హంగులకే దూరంగా ఉంది. అందుకే అమరావతి బదులు వెలగపూడిపై దృష్టి సారిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం అమరావతిని పక్కకుపెట్టి, వెలగపూడిపై దృష్టి సారించడానికి కారణాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. వివిధ కారణాలు - సాంకేతిక అంశాల కారణంగా మరో మూడేళ్ల వరకూ అమరావతిలో నిర్మాణాలు చేసే పరిస్థితి లేదని, అందుకే వెలగపూడిపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినా, ఐదేళ్లలో రాజధాని నగరాన్ని నిర్మించలేకపోయారన్న విమర్శలకు తెరదించేందుకే వెలగపూడిపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

నిజానికి, వెలగపూడి తాత్కాలిక రాజధాని - తాత్కాలిక సచివాలయం అని పైకి చెబుతున్నప్పటికీ.. అసలు రాజధాని అదేనన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. వెలగపూడిలో ప్రస్తుతం నిర్మిస్తోన్న తాత్కాలిక సచివాలయానికి, 1000 నుంచి 1200 కోట్ల రూపాయల ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తర్వుల్లో కూడా ఎంత ఖర్చు పెడతామని నిర్దిష్టంగా చెప్పకపోవడం ప్రస్తావనార్హం. ఒక్క గోడల నిర్మాణాల వ్యయమే రెండువందల కోట్లు అవుతాయంటున్నారు. వెలగపూడిలో మొత్తం 5 బిల్డింగులు నిర్మించనున్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక భవనంలో అసెంబ్లీ - కౌన్సిల్ - శాసనసభాపక్షపార్టీలకు కార్యాలయాలు నిర్మించనున్నారు. అసలు తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సుమారు 200 కోట్లు ఖర్చవుతాయి. దానికి అదనంగా 430 కోట్ల రూపాయలు కేవలం అసెంబ్లీ - కౌన్సిల్ అదనపు హంగులకు ఖర్చవనున్నాయి. అంటే భవనానికి కాకుండా వాటికి అదనపు సోకుల కోసమే ఎక్కువ ఖర్చవుతుందన్న మాట! ఇంటీరియల్ డెకరేషన్ ఎంత ఆధునిక పద్ధతుల్లో చేపట్టినా, కనీసం నెలరోజుల సమయం పడుతుందంటున్నారు.

ఈ ప్రకారంగా.. సుమారు వెయ్యి నుంచి 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అమరావతిలో అసలు సచివాలయం నిర్మించిన తర్వాత, వెలగపూడి నిర్మాణాలను మరొక అవసరాలకు వినియోగించుకుంటామన్న ప్రభుత్వ వాదనను, ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన వెలగపూడి కాకుండా.. ఇంకా నిర్మాణాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని అమరావతిని, రాజధాని అంటే ఎవరూ విశ్వసించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్నిబట్టి నవ్యాంధ్ర అసలు రాజధాని అమరావతి కాకుండా వెలగపూడి అని స్పష్టమవుతోంది.
Tags:    

Similar News