వరవరరావుకు కరోనా ! కుటుంబ సభ్యుల్లో ఆందోళన

Update: 2020-07-16 15:30 GMT
మహారాష్ట్రలోని ముంబై జైలులో ఉన్న విరసం నేత వరవరరావు అనారోగ్యానికి గురికావడంతో నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఇప్పటికే ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో వరవరరావు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వృద్ధాప్యంలో అనేక ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్న వ్యక్తిని జైలులో అనవసరంగా బంధించడం వల్లే ఆయన కరోనా బారిన పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆయన ఆరోగ్యం గురించి తెలిసి కరోనా సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఆయన్ను ఇరికించిందని కుటుంబసభ్యులు మరోసారి ఆరోపించారు.

రెండ్రోజుల క్రితం తాత్కాలిక బెయిల్‌ కోసం వరవరరావు బాంబే హైకోర్టులో పిటిషను వేశారు. ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండటం, రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషనులో ఆయన కోరారు. ఇంతలో ఆయనకు కరోనా నిర్దారణ కావడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జేజే ఆస్పత్రి నుంచి ఆయనను సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Tags:    

Similar News