వాలంటైన్స్ డే.. మీనింగ్ మార్చేసిన ఆర్ ఎస్ ఎస్‌.. నిజం!!

Update: 2021-02-14 02:55 GMT
ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేమికుల కోసం ఉన్న ఏకైక రోజు.. వాలంటైన్స్ డే! ప్రేమికులు ఈ రోజు కోసం క‌ళ్లు కాయలు కాచేలా ఎదురు చూడ‌డం తెలిసిందే. ముఖ్యంగా గ‌త రెండు ద‌శాబ్దాలుగా మ‌న దేశంలోనూ వాలంటైన్స్ డేను ప్రేమికులు ఎంతో `ప్రేమ‌`తో నిర్వ‌హించుకుంటున్నారు. తాము ఇష్ట‌ప‌డే వ్య‌క్తుల‌కు, ప్రేమించే వ్య‌క్తుల‌కు కానుక‌లు ఇవ్వ‌డం.. ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించ‌డం.. ఈ రోజు స‌హ‌జం. అందుకే.. ప్రేమికుల దినోత్స‌వంగా ఫిబ్ర‌వ‌రి 14 నిలిచిపోయింది. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా స‌హా డిజిట‌ల్ మాధ్య‌మాలు పెరిగిన ద‌రిమిలా.. ఈ రోజుకు మ‌రింత ప్ర‌చారం ల‌భించింది. ప్రేమికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపేవారు కూడా పెరిగారు. ఇక‌, ప్రేమ వివాహాలు చేసుకుని.. చ‌క్క‌ని కుటుంబాలు ఏర్ప‌రుచుకున్న వారు సైతం ఈ ప్రేమికుల రోజును నిర్వ‌హించుకుంటున్నారు.

అయితే.. ఆది నుంచి ఆర్ ఎస్ ఎస్‌(రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌)ఈ ప్రేమికుల దినోత్స‌వాన్ని వ్య‌తిరేకిస్తూనే ఉంది. ``ఇది పాశ్చాత్య సంస్కృతి. మ‌న‌కెందుకు`` అని ప్ర‌చారం చేస్తోంది. క‌ర‌ప‌త్రాలు ముద్రిస్తోంది. ఇక‌, ఆర్ ఎస్ ఎస్ యూత్ అయితే.. మ‌రింత రెచ్చిపోయి.. పార్కుల్లో ఒకింత సేద‌దీరేందుకు వ‌చ్చే ప్రేమికుల‌ను ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించ‌డం లేదా.. అక్క‌డిక‌క్క‌డ పెళ్లిళ్లు చేసేయ‌డం.. వంటి కార్య‌క్ర‌మాల‌కు కూడా తెర‌దీసింది. ఇటీవ‌ల కాలంలో ఇదికూడా శృతి మించి.. ప్రేమికుల‌పై ఆ రోజున దాడులు కూడా చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ కు ఈ పిచ్చి పీక్‌కు వెళ్లింది. వాలంటైన్స్ డే మీనింగ్‌నే మార్చేసింది. వాలంటైన్స్ డే  అంటే.. తల్లిదండ్రుల పూజా దినోత్స‌వ‌మ‌ని కొత్త అర్ధం చెప్పుకొచ్చింది.

అంతేకాదు..  ఫిబ్రవరి 14న కర్ణాటక స‌హా చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో క‌నిపించే ప్రేమికుల‌ను అడ్డుకుని తీరాల‌ని కూడా ఆర్ ఎస్ ఎస్ వింగ్ అయిన శ్రీరామ్ సేన పిలుపునిచ్చింది. శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ మాట్లాడుతూ, తమ  సంస్థ సభ్యులు  వాలంటైన్స్ డే సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర, అశ్లీలమైన కార్యక్రమాలు జరగకుండా నిరోధిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం తాము ఫిబ్రవరి 14న తల్లిదండ్రుల పూజలు నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 60 చోట్ల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. పబ్‌లు, బార్లు, షాపింగ్ మాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్లు, పార్కులు వంటి చోట్ల ప్రేమికులు చేర‌కుండా తమ కార్యకర్తలు చర్యలు తీసుకుంటారన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఫిబ్ర‌వ‌రి 14న తల్లిదండ్రుల‌ను పూజించాల‌ని కూడా పిలుపునివ్వ‌డం పిచ్చి పీక్‌కు వెళ్ల‌డం కాక‌మ‌రేంటి? అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు!! నిజ‌మే క‌దా?!
Tags:    

Similar News