గాలిలో ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు యత్నం.. విమాన ప్రయాణికుడి వెర్రి చేష్టలు..
మార్చి 22వ తేదీ జైపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఉత్కర్ష్ గౌతమ్ అనే యువకుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు.;
ఐఐటీ (IIT) చదివి, ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన ఒక ఉన్నత విద్యావంతుడు ఇలా గాల్లో విమానం తలుపులు తీసేందుకు ప్రయత్నించడం అంటే అది ప్రయాణికులందరి ప్రాణాలను పణంగా పెట్టడమే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ డోర్ తీయాలని చూడడం కేవలం క్రమశిక్షణా రాహిత్యం మాత్రమే కాదు.., అది ఒక భారీ ప్రమాదానికి దారితీసే చర్య. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోలీసులపై అసత్య ప్రచారం చేస్తూ వీడియోలు పెట్టడం అతని పరిస్థితిని మరింత దిగజార్చింది. అయితే, దీని వెనుక ఉన్న ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక అనారోగ్యం కోణం ఇప్పుడు ఈ కేసును మరో మలుపు తిప్పింది.
గాలిలో గందరగోళం..
మార్చి 22వ తేదీ జైపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఉత్కర్ష్ గౌతమ్ అనే యువకుడు ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. విమానం గగనతలంలో ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల లోపల గాలి పీడనం మారిపోయి విమానం కూలిపోయే ప్రమాదం ఎదురైంది. సమయానికి విమాన సిబ్బంది స్పందించి అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఇండిగో సంస్థ అతడిని ‘అన్‌రూలీ ప్యాసింజర్’ జాబితాలో చేర్చి, భవిష్యత్తులో ప్రయాణించకుండా నిషేధించే అవకాశం ఉంది.
పోలీసులపై సోషల్ మీడియాలో పోస్టులు!
విమానం ల్యాండ్ అయిన తర్వాత బెంగళూరు పోలీసులు ఉత్కర్ష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, విడుదలైన 24 గంటల్లోనే అతను ప్లేటు ఫిరాయించాడు. తనను పోలీసులు కారణం లేకుండా కొట్టారని, వేధించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు షేర్ చేశాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించడంతో, బెంగళూరు పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకొని అతనిపై మరో కేసు నమోదు చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను తప్పుడు ఆరోపణలకు వాడుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్నారు.
దెబ్బతీసిన మానసిక వ్యాధి!
ఉత్కర్ష్ గౌతమ్ కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.., అతను ఐఐటీ గ్రాడ్యుయేట్, గతంలో పెద్ద కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. అయితే, అతను ‘బైపోలార్ డిజార్డర్’ అనే తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్నవారిలో మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి; ఒక్కోసారి అత్యంత ఉత్సాహంగా, మరికొన్ని సార్లు తీవ్రమైన కోపంతో లేదా కుంగుబాటుతో ప్రవర్తిస్తుంటారు. బహుశా ఆ స్థితిలోనే అతను విమానంలో అలా ప్రవర్తించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అతను ఎటువంటి ఉద్యోగం చేయడం లేదు.
ఈ కేసు ఇప్పుడు పోలీసులకు ఒక సవాల్‌గా మారింది. ఒకవైపు వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, పోలీసులపై అపవాదు వేయడం వంటి నేరాలు ఉంటే.. మరోవైపు అతను మానసిక రోగి కావడం గమనార్హం. ఇలాంటి వారిని కేవలం జైలుకు పంపడం కంటే, సరైన మానసిక చికిత్స అందించడం, భవిష్యత్తులో వారు విమాన ప్రయాణాలు చేయకుండా నియంత్రించడం అవసరం. విద్యావంతుల్లో కూడా పెరుగుతున్న ఇలాంటి మానసిక ఒత్తిళ్లు మరియు అనారోగ్యాలపై సమాజం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.