తెలంగాణ అసెంబ్లీలో ఆహ్లాదకర దృశ్యం.. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి మర్యాద ఊహించగలమా?

రాజకీయాలు అంటే విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం. రాజ్యాధికారం కోసం పార్టీలు, ఆయా పార్టీల నేతలు నిత్యం పొట్లాడుకుంటారు.;

Update: 2026-03-27 12:30 GMT

రాజకీయాలు అంటే విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజం. రాజ్యాధికారం కోసం పార్టీలు, ఆయా పార్టీల నేతలు నిత్యం పొట్లాడుకుంటారు. విమర్శలు చేసుకుంటారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయానికి అసలు కొదవే ఉండదు. అయితే తెలంగాణ రాజకీయాలు మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య ఏ స్థాయిలో రాజకీయ విభేదాలు ఉన్న.. నేతలు ఎదురుపడినప్పుడు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ, ఏపీలో ఇలాంటి మర్యాదను అసలు ఊహించలేమని అంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో తాజాగా కనిపించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాను విశేషంగా ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో వాగ్బాణాలు సంధించుకునే నాయకులు.. అదే అసెంబ్లీలో సరదాగా ముచ్చటించడం వీక్షకులకు కనువిందు చేస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావు అసెంబ్లీలో మంత్రుల స్థానాల వద్దకు వెళ్లి వారితో ప్రజా సమస్యలపై చర్చించుకోవడం కనిపించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పార్టీకి అగ్రనేతలుగా చెలామణి అయినా సభలో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా ఆ ఇద్దరు చక్కని సందేశం ఇచ్చారని ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇదే సమయంలో ఇలాంటి దృశ్యాలను ఏపీలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికార, విపక్షాలు ఉప్పు నిప్పులా పనిచేస్తున్నాయని అంటున్నారు. నేతల మధ్య సహృద్భావ వాతావరణం మచ్చుకైనా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాస్త ఆగర్భ శత్రువులుగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణలో కనిపిస్తున్న ‘రాజకీయ పరిణతి’ ఏపీలో కనిపించకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.

ఏపీలో రాజకీయం కేవలం సిద్ధాంతాల మధ్య పోరాటంలా కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు కలుసుకోవడం అటుంచితే, కనీసం మర్యాదపూర్వక పలకరింపులు కూడా కరువయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ నేతలు సీట్లు మారి కూర్చుని చర్చించుకోవడం ప్రజాస్వామ్యంలోని అందాన్ని చాటిచెబితే.. ఏపీలో మాత్రం సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిష్కరణలతోనే కాలం గడిచిపోతోందని అంటున్నారు. తెలంగాణ నేతలను చూసి ఏపీ నేతలు నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయకపోయినా.. కనీసం ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకున్నా బాగుంటుందని జనం సూచిస్తున్నారు.

Tags:    

Similar News