వ్యాక్సిన్ వికటించి భారత్ లో తొలి మరణం ..ముప్పు తక్కువేనన్న కేంద్రం

Update: 2021-06-16 08:30 GMT
కరోనా వైరస్ వ్యాక్సిన్ వికటించి 68 ఏళ్ల ఓ వ్యక్తి మరణించినట్లు వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ  నివేదిక వెల్లడించింది. వ్యాక్సిన్ దుష్ప్రభావంతో దేశంలో తొలి మరణం చోటు చేసుకుంది. గతంలో వ్యాక్సిన్ వికటించి పలువురు మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ, వ్యాక్సిన్‌ తో ఆ మరణాలకు సంబంధం లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం...వ్యాక్సిన్ దుష్ప్రభావాలతో మరణించినట్లుగా చెప్పబడుతున్న 31 కేసులను నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. ఇందులో 68 ఏళ్ల ఓ వృద్దుడు వ్యాక్సినేషన్ తర్వాత అనాఫిలాక్సిస్‌ బారినపడినట్లు గుర్తించారు.

మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతను అనాఫిలాక్సిస్ బారినపడినట్లు తేల్చారు. దాని కారణంగానే అతను మృతి చెందినట్లు నిర్దారించారు. అనాఫిలాక్సిస్ అనేది ప్రాణాంతక అలర్జిక్ రియాక్షన్.దీని బారినపడితే చర్మంపై దద్దుర్లు,రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం,శ్వాసకోశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాక్సినేషన్‌తో ముడిపడి మరణం సంభవించిన కేసులు మరో మూడు ఉన్నప్పటికీ... నిపుణుల కమిటీ మాత్రం ఒక్క మరణాన్నే ధ్రువీకరించింది. వ్యాక్సినేషన్ తర్వాత 16,19 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో అనాఫిలాక్సిస్ బారినపడ్డారు. అయితే వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. అధ్యయనం చేసిన మొత్తం 31 కేసుల్లో... 18 మంది యాధృచ్చికంగా టీకా తీసుకున్న తర్వాత మరణించారని నిపుణుల కమిటీ వెల్లడించింది. ఈ మరణాలకు వ్యాక్సినేషన్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. టికా తీసుకున్న వారిలో ప్రతికూల ఫలితాలు తలెత్తిన సందర్భాలు కేవలం 0.01 శాతమని, ఇక మరణానికి దారితీసిన ఘటనల శాతం ఇంతకంటే తక్కువని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
Tags:    

Similar News