తెలంగాణలో ఉప్పునిప్పులు కలిశాయ్

Update: 2017-01-08 05:49 GMT
ఉత్తర దక్షిణ ధ్రువాలన్నట్లుగా ఉండే ఇద్దరు ప్రముఖ నేతలు చేతులు కలపటం చిన్న విషయం కాదు. ప్రజల్లో పట్టు ఉన్న నేతలు.. పార్టీలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేతల మధ్య సయోధ్య తెలంగాణ కాంగ్రెస్ తోపాటు.. రాష్ట్ర రాజకీయాలపైనా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడేళ్ల నుంచి ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్న ఉత్తమ్.. కోమటిరెడ్డిల మధ్య వైరం ఒక కొలిక్కి రావటమే కాదు.. ఇరువురి మధ్య మాటలు కలవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎవరికి వారుగా ఉండే విషయం తెలిసిందే. అలాంటి ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకు రావటం.. కలిసిమెలిసి మాట్లాడుకోవటం.. తమ మధ్య దూరం తగ్గిపోయిందన్న సందేశాన్ని ఇచ్చేలా వ్యవహరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకువచ్చిన ఈ ముగ్గురు నేతలు కలిసి భోజనం చేయటం.. మంతనాలు జరపటం విశేషం.

పాత నల్గొండ జిల్లాకు చెందిన జానా.. ఉత్తమ్.. కోమటిరెడ్డిల మధ్య 2009 నుంచి వారి మధ్య సరైన సంబంధాలు లేవు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కోమటిరెడ్డి తన మంత్రిపదవికి రాజీనామా చేయటం.. ఆ స్థానంలో ఉత్తమ్ కు చోటు లభించటంతో వీరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. కొన్ని సందర్భాల్లో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి వేళ.. అందుకు భిన్నంగా కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్.. జానాలు భోజనానికి వెళ్లటం తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లేనని చెబుతున్నారు. ఇంతకాలం నిప్పు.. ఉప్పులా వ్యవహరించిన నేతల మధ్య వైరం తగ్గి.. స్నేహం పెరిగిన నేపథ్యంలో.. అందుకు తగ్గట్లే రాజకీయ సమీకరణాలు మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. కార్యకర్తలకు.. అభిమానులకు కావాల్సిందేముంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News