ట్రంప్ భారత పర్యటన వివరాలు బయటకొచ్చాయ్

Update: 2020-02-20 05:00 GMT
ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ భారత్ కు వస్తున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ కు వస్తున్న ఆయన టూర్ ప్లాన్ కొంతమేర బయటకు వచ్చింది. ఈ నెల 25.. 25 తేదీల్లో ఆయన భారత్ ను సందర్శిస్తున్నారు. తన సతీమణి తో కలిసి వస్తున్న ట్రంప్ అమెరికా నుంచి నేరుగా గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లోని వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగనున్నారు.

వారికి ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలుకుతారు. వారిద్దరూ కలిసి ఎయిర్ పోర్టు నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని సబర్మతి ఆశ్రమం వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ట్రంప్ అక్కడ అరగంట పాటు ఉంటారు. గాంధీ నివసించిన కుటీరం (హృదయ కుంజ్‌)ను సందర్శిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ట్రంప్ దంపతులతో పాటు.. పలువురు ప్రముఖులకు ప్రత్యేక విందును ఇస్తారు.

ఈ విందు తర్వాత ట్రంప్ దంపతులు అక్కడి నుంచి ఆగ్రాకు వెళతారు. సాయంత్రం ఐదు గంటల వేళ లో వారు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వద్దకు చేరుకుంటారు. అక్కడ అరగంట నుంచి నలభై నిమిషాల వరకూ గడిపి ఢిల్లీకి వెళతారు. తర్వాతి రోజు షెడ్యూల్ ఇంకా బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News