పొసాని నుంచి అంబటి వరకు.. సేమ్ టు సేమ్.. పీటీ వారెంట్స్ వేట!

జైలు.. బెయిలు.. మళ్లీ జైలు అన్నట్లు తయారైంది వైసీపీ నేతల పరిస్థితి. ఏదో ఒక కేసులో జైలుకు వెళుతున్న విపక్ష నేతలు జైలు నుంచి విడుదల కావడం పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు.;

Update: 2026-02-12 19:30 GMT

జైలు.. బెయిలు.. మళ్లీ జైలు అన్నట్లు తయారైంది వైసీపీ నేతల పరిస్థితి. ఏదో ఒక కేసులో జైలుకు వెళుతున్న విపక్ష నేతలు జైలు నుంచి విడుదల కావడం పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు. తాజాగా అరెస్టు అయిన అంబటి రాంబాబు పరిస్థితి ఇందుకు మరో నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకు ముందు కూడా వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగాం, సురేష్, కాకాణి గోవర్దన్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటివారు కూడా జైలుకి వెళ్లి విడుదల కాడానికి పెద్ద యజ్ఞమే చేయాల్సివచ్చిందని అంటున్నారు. ఈ పరిణామాలను ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా వైసీపీ విమర్శిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ కేసులో బెయిలు పొందినా జైలు నుంచి విడుదల కాలేదు. ఆయనపై రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేయడంతో జైలు నుంచి విడుదల కావాల్సిన రోజునే మళ్లీ రిమాండ్ విధించేలా చేస్తున్నారని అంటున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 31న అరెస్టు అయిన అంబటికి ఈ నెల 9న బెయిలు వచ్చింది. ఈ కేసులో ఆయన విడుదల అవనున్నారు అని తెలిసిన వెంటనే గుంటూరు పోలీసులు గత ఏడాది నవంబరు 12న నమోదు చేసిన కేసులో పీటీ వారెంటు జారీ చేశారు.

ఈ పరిణామంతో అంబటి విడుదల అప్పట్లో వాయిదా పడింది. ఈ కేసులో కూడా 11న బెయిలు రాగా, అదే రోజు సత్తెనపల్లె టౌన్ పోలీసులు 2023లో నమోదైన కేసులో పీటీ వారెంటు దాఖలు చేశారు. దీంతో గురువారం విడుదల కావాల్సిన అంబటి సత్తెనపల్లి కోర్టుకు రావాల్సివచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అంబటి మళ్లీ రాజమండ్రి జైలుకు వెళ్లారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అంబటిని ఇప్పట్లో విడిచిపెట్టరా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. అంబటిపై మొత్తం 52 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. ఇందులో దాదాపు 36 కేసులపై 41ఏ నోటీసు జారీ చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

అయితే మిగిలిన కేసుల విషయమై స్పష్టత లేకపోవడంతో అంబటి ఎప్పుడు బయటకు వస్తారనే అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. జైలు నుంచి విడుదల కావాల్సిన అంబటిపై పోలీసులు వరుసగా పీటీ వారెంట్లు జారీ చేయడాన్ని వైసీపీ తీవ్రంగా నిరసిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని అంటున్నారు. అంబటిపై పెండింగులో ఉన్న అన్నికేసులపైనా పీటీ వారెంట్లు దాఖలు చేసి కోర్టుల్లో హాజరుపరచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందా? అని చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు కూడా వైసీపీకి చెందిన పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ వంటి వారిని ఇదేమాదిరిగా పీటీ వారెంట్లపై రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్ల మధ్య తిప్పారని గుర్తు చేస్తున్నారు.

అదేవిధంగా వల్లభనేని వంశీ, కాకాణి గోవర్దన్ రెడ్డి, నందిగాం సురేష్ వంటి నేతలను సైతం బెయిలుపై వెంటనే విడుదల కాకుండా కేసుపై కేసు పెట్టి జైలులోనే ఉండేలా చేశారని అంటున్నారు. ప్రస్తుతం అంబటి రాంబాబు విషయంలోనూ అదే ఎపిసోడ్ నడిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంబటి విడుదలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News