అగ్రరాజ్యాల అధినేతలే అతడికి బందీలు.. ఎప్‌స్టీన్ 'కామ' కథలు

ప్రపంచ రాజకీయ యవనికపై ఒక ఫైనాన్షియర్‌గా బిలియనీర్‌గా వెలిగిపోయిన పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపం ఒక కరడుగట్టిన నేరగాడిది.;

Update: 2026-02-12 17:04 GMT

ప్రపంచ రాజకీయ యవనికపై ఒక ఫైనాన్షియర్‌గా బిలియనీర్‌గా వెలిగిపోయిన పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపం ఒక కరడుగట్టిన నేరగాడిది. టీనేజ్ బాలికలను వేటాడి.. వారిని శక్తివంతులైన వ్యక్తులకు ఎరగా వేసి, ఒక అంతర్జాతీయ సె*క్స్ ట్రాఫికింగ్ రాకెట్‌ను నడిపిన 'కామరూప పిశాచి' ఇతడు. 2019లో జైలు గదిలో అతని మరణం ఒక రహస్యంగా మిగిలిపోయినా అతడు వదిలివెళ్లిన 'బ్లాక్ బుక్' ఇప్పటికీ ప్రపంచ దేశాల అధినేతలను, దిగ్గజాలను నిద్రపోనివ్వడం లేదు.

- సామాన్యుడి నుంచి 'వాల్‌స్ట్రీట్' మాయావి వరకు

1953లో న్యూయార్క్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఎప్‌స్టీన్ ప్రయాణం ఆశ్చర్యకరం. డిగ్రీ కూడా పూర్తి చేయని వ్యక్తి, గణితంలో తనకున్న పట్టుతో ఏకంగా డాల్టన్ స్కూల్‌లో టీచర్‌గా చేరిపోయాడు. అక్కడే విద్యార్థినులపై ఇతని కన్ను పడింది. ఆ తర్వాత ఆర్థిక రంగంపై పట్టు పెంచుకుని వాల్‌స్ట్రీట్ దిగ్గజాల సరసన చేరాడు. తాను ఒక నిఘా సంస్థ ఏజెంట్‌నని ప్రచారం చేసుకోవడం ద్వారా తన చుట్టూ ఒక మిస్టరీని సృష్టించుకున్నాడు.

- 'లోలితా ఎక్స్‌ప్రెస్' పాపపు ద్వీపం

ఎప్‌స్టీన్ తన అక్రమ సామ్రాజ్యాన్ని కేవలం భవనాలకే పరిమితం చేయలేదు. వర్జిన్ ఐలాండ్స్‌లో 'లిటిల్ సెయింట్ జేమ్స్' అనే సొంత ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అక్కడికి మైనర్ బాలికలను తరలించడానికి ఒక ప్రైవేట్ జెట్‌ను ఉపయోగించేవాడు. లోలితా ఎక్స్‌ప్రెస్ అని ఈ విమానానికి స్థానికులు పెట్టిన పేరిది. ఈ జెట్ ఫ్లైట్ లాగ్స్‌లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తుల పేర్లు ఉండటం గమనార్హం. తన భవనాల్లోని ప్రతి గదిలో రహస్య కెమెరాలు అమర్చి, ప్రముఖుల ప్రైవేట్ క్షణాలను రికార్డు చేసేవాడు. దీని ద్వారా వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి.

- వలలో చిక్కుకున్న 'పెద్ద తలకాయలు'

ఎప్‌స్టీన్ డైరీలో లేదా అతనితో సంబంధాలు ఉన్న వారి జాబితాలో లేని ప్రముఖుడు లేడంటే అతిశయోక్తి కాదు. బిల్ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ వంటి మాజీ అధ్యక్షులు... వ్యాపార దిగ్గజాలైన బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి టెక్ బిలియనీర్లు.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా వీరందరూ నేరంలో భాగస్వాములని తేలకపోయినా ఎప్‌స్టీన్‌తో వీరికున్న సాన్నిహిత్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గిస్లైన్ మాక్స్‌వెల్.. చీకటి వల విసిరిన సూత్రధారి

ఎప్‌స్టీన్ ఒంటరిగా ఈ దారుణాలు చేయలేదు. అతనికి కుడిభుజంగా నిలిచిన మహిళ గిస్లైన్ మాక్స్‌వెల్. మోడలింగ్ ఛాన్సులు, స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తామని నమ్మబలికి పేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను ఎప్‌స్టీన్ వద్దకు చేర్చే బాధ్యత ఈమెదే. సుమారు 1,000 మందికి పైగా బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి.

- వ్యవస్థల వైఫల్యం.. అనుమానాస్పద మరణం

2008లో మొదటిసారి దొరికినప్పుడు, కేవలం 18 నెలల సాధారణ శిక్షతో ఎప్‌స్టీన్ బయటపడటం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఒక 'సీక్రెట్ ప్లీ డీల్' ద్వారా అతను తనపై ఉన్న కేసులను నీరుగార్చగలిగాడు. అయితే 2019లో మళ్ళీ అరెస్టయినప్పుడు పరిస్థితి మారింది. బెయిల్ రాకుండా జైలులో ఉన్న సమయంలోనే అతను అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో జైలు కెమెరాలు పనిచేయకపోవడం.. సెక్యూరిటీ గార్డులు నిద్రపోవడం వంటి అంశాలు ఇది హత్యేమో అన్న అనుమానాలను ఇప్పటికీ సజీవంగా ఉంచాయి.

న్యాయం జరిగిందా?

జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణంతో అతని రహస్యాలన్నీ సమాధి అయ్యాయని చాలామంది భావించారు. కానీ న్యాయస్థానాలు విడుదల చేస్తున్న ఫైళ్లు ఇప్పటికీ కొత్త నిజాలను వెలుగులోకి తెస్తున్నాయి. డబ్బు, అధికారంతో ఎంతటి ఘోరాన్నైనా కప్పిపుచ్చవచ్చని ఎప్‌స్టీన్ భావించాడు.. కానీ ప్రకృతి అతనికి శిక్ష విధించింది. అయితే అతని వెనుక ఉన్న ఆ 'పెద్దల' అసలు రంగు బయటపడినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది.

Tags:    

Similar News