శ‌బ‌రిమ‌ల‌లో అర్బ‌న్ న‌క్స‌లైట్లు..కేంద్ర‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2019-11-18 10:24 GMT
శబరిమల అయ్యప్ప ఆలయం కేంద్రంగా మ‌రోమారు వివాదం చెల‌రేగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ...మహిళలు కూడా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉద్రిక్తకరమైన పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది మహిళలు గతంలో ఆలయంలోకి ప్రవేశించారు. కాగా, దీనిపై రివ్యూ పిటిషన్ వేయగా - సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను ఐదుగురు జ‌డ్జీల‌ ధర్మాసనం నుంచి ఏడుగురు న్యాయ‌మూర్తుల‌ ధర్మాసనానికి బదిలీ చేసింది. 2018లో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకపోవడంతో... మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు శబరిమల చేరుకుంటున్నారు. వీరిపై విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. శబరిమలకు వెళుతున్న భక్తులను అర్బన్ నక్సల్స్ అని మండిప‌డ్డారు.

కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...సుప్రీంకోర్టు తాజా ప్రకటనతో శబరిమల ఆలయంలో పూర్వస్థితిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. కేసు విస్తృత బెంచ్ కు బదిలీ కావడంతో గతేడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై కొంత సందిగ్ధత ఏర్పడిందన్నారు. స్పష్టత వచ్చేవరకు.. తమ ప్రభుత్వం పూర్వ సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్న పోలీసులు 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలను పంబా నుంచే తిప్పి పంపిస్తున్నారు. శబరిమల ఆలయానైకి వచ్చే మహిళలను పంబ నుంచి వెనక్కి పంపించేస్తున్నారు.  ఇప్పటికే పదిమంది మహిళలను పంబ నుంచి వెనక్కి పంపించేశారు.

కాగా, మ‌హిళ‌ల రాక‌ - వివాదంపై కేంద్ర‌మంత్రి స్పందిస్తూ - ఆ మ‌హిళ‌లంతా అరాచకవాదులు - నాస్తికులని మండిప‌డ్డారు. వాళ్లు నిజమైన భక్తులా కాదా అని తెలియాలంటే కొండపైకి వచ్చే వారిని విచారణ చేయాలని మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండ‌గా - మహిళలు మీడియాలో ప్రచారం కోసమే శబరిమల ఆలయానికి రావొద్దని - వారికీ ఎలాంటి రక్షణ కల్పించలేమని ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పేర్కొన్నారు.

మ‌రోవైపు - శరణు ఘోషతో శబరిమల అయ్యప్ప ఆలయం మార్మోగుతోంది. మండల పూజ కోసం ఆలయాన్ని శ‌నివారం సాయంత్రం తెరిచారు. వేల మంది భక్తులు శబరిమలకు వస్తున్నారు. దీక్షలు స్వీకరించిన స్వాములు పంబా బేస్ క్యాంప్ నుంచి శబరి కొండకు కాలి నడక మార్గంలో వెళ్తున్నారు. దీక్ష విరమణల సమయం కావడంతో… శబరి కొండపై ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయం వచ్చే ఏడాది జనవరి 20 వరకు తెరిచే ఉంటుంది. మధ్యలో డిసెంబర్ చివరి వారంలో  2 రోజులు మాత్రం మూసి ఉంచుతారు.


Tags:    

Similar News