అదేంది పెద్దిరెడ్డి..పుసుక్కున అంత మాట అనేశావు

Update: 2022-12-13 05:34 GMT
ఎవరేం అనుకుంటే మాత్రం.. ఆకాశాన్నే హద్దుగా లక్ష్యాన్ని పెట్టుకునేటోళ్లు కొందరు కనిపిస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కోవలోకే వస్తారు. సాధ్యాసాధ్యాల్ని పక్కన పెడితే.. ప్రయత్నం అంటూ మొదలు పెట్టాలన్నట్లుగా ఆయన నోటి నుంచి ఇటీవల కాలంలో ఒక మాట తరచూ వినిపిస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాల్లో పార్టీ విజయం సాధించాలన్నది ఆయన లక్ష్యం. ఇందుకోసం ఆయన చాలానే నమ్మకంగా ఉన్నారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటివి అసాధ్యమన్న మాట ఆయన కలలోకి రావటానికి సైతం ఇష్టపడటం లేదన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు.

అలాంటి తీరును సీఎం జగన్ ప్రదర్శిస్తుంటే.. ఆయనకు అత్యంత సన్నిహితుడు.. రాష్ట్ర మంత్రుల్లో పవర్ ఫుల్ మంత్రిగా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోటి నుంచి వచ్చిన అనూహ్య వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.

సీఎం జగన్ అంటే విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే ఆయన.. పార్టీకి వీర విధేయుడిగా వ్యవహరించటం తెలిసిందే. చేతిలో ఉన్న అధికారాన్ని చేతల్లో ఎలా చూపించాలనే విషయంలో పెద్దిరెడ్డి టాలెంట్ మామూలుగా ఉండదని చెబుతారు. తాజాగా ఆయన ఇన్ ఛార్జిగా ఉన్న జిల్లాలకు వెళ్లి సమావేశాల్ని ఏర్పాటు చేయటం.. ఆ సందర్బంగా పార్టీలో నెలకొన్న అసమ్మతిని  ఆయన ఎదుర్కోవాల్సి రావటం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా అనంతపురం పట్టణంలో నిర్వహించిన రాప్తాడు నియోజకవర్గ రివ్యూలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అసమ్మతి ఉందని.. తనకూ ఉందన్న పెద్దిరెడ్డి.. ''ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనూ అసమ్మతి ఉంది. వాటన్నింటిని పక్కన పెట్టి ప్రతి నేతను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో వెళతాం' అని ఆయన వ్యాఖ్యానించారు.

అసమ్మతి ఎక్కడ ఉన్నా సరే.. జగన్ కు ఆయన కుటుంబానికి పెట్టని కోటలా ఉండే పులివెందుల నియోకవర్గంలోనూ అసమ్మతి ఉందని చెప్పటం.. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి నోటి నుంచి రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

నూటికి నూరు శాతం గెలుపు ఖాయమని సీఎం ధీమాగా ఉన్న వేళ.. ఇంటి పోరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ ఉందంటూ పెద్దిరెడ్డి నోటినుంచి వచ్చిన మాట బాంబులా పేలేలా ఉందని అంటున్నారు. ఇంట్లో ఈగల మోతను పెట్టుకొని బయట పల్లకీ మోత అన్న సామెత పెద్దిరెడ్డి వారి మాట వింటే కలుగకమానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News