లూజుగా బట్టలు కుట్టాడని టైలర్ ను చంపేశారు

Update: 2022-01-01 07:34 GMT
అసలు సాటి మనిషి ప్రాణాలు తీయాలన్న ఆలోచనే తప్పు. ఒకవేళ ఒక మనిషి ప్రాణాలు తీయాలంటే అందుకు ఎంత పెద్ద కారణం ఉండాలి? కానీ.. అందుకు భిన్నంగా ప్రాణాలు తీయటానికి అసలు కారణమే లేని అంశంలో కూడా ప్రాణాలు తీసేస్తున్న వైనం చూస్తే.. మనం ఎక్కడికి వెళుతున్నాం? మన అడుగులు ఎలా పడుతున్నాయన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి ఉదంతం విశాఖపట్నంలో చోటు చేసుకుంది. బట్టలు కుట్టమని ఇస్తే.. చెప్పిన దానికి భిన్నంగా లూజుగా కుట్టాడన్న కోపంతో.. ఒక టైలర్ ను హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారింది. ఇంత దారుణం ఎలా జరిగిందంటే?

విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో ఒడిశాకు చెందిన 60 ఏళ్ల బుడు మరణించారు. ఒడిశాకు చెందిన వాడైన ఆయన.. వైజాగ్ లో సెటిల్ అయి.. అక్కడే టైలర్ గా పని చేస్తున్నాడు. అతగాడు ఉండే కాలనీకి చెందిన గణేశ్ అనే కుర్రాడు బట్టలు కుట్టాలని పది రోజుల ముందు బట్టలు ఇచ్చాడు. గురువారం వాటిని తీసుకున్న గణేశ్.. బుడు కుట్టిన బట్టలు బాగా లూజుగా ఉన్నాయని.. మళ్లీ సరిచేసి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.

అయితే.. రాత్రి వేళ తన కంటిచూపు సరిగా ఉండదని.. పక్క రోజున సరి చేసి ఇస్తానని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న గణేశ్ బుడుపై గొడవకు దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గణేశ్.. అతని కుటుంబ సభ్యులు సూర్యనారాయణ.. క్లింటన్ లు కలిసి గణేశ్ పై తీవ్రంగా దాడి చేశారు. దీంతో.. బుడును ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లుగా డాక్టర్లు చెప్పారు. తన భర్తను కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడినా నిందితులు ఆగలేదని.. దారుణంగా కొట్టారంటూ మృతుడి భార్య లక్ష్మీ కన్నీరు మున్నీరు అవుతోంది. చిన్న విషయానికి మనిషి ప్రాణాల్ని తీసిన ఈ వైజాగ్ కుర్రాళ్లను ఏం చేయాలంటారు?



Tags:    

Similar News