తుని రైలు దహనం కేసు వచ్చే నెల 6 కి వాయిదా,సంబంధం లేదన్న ఎమ్మెల్యే!

Update: 2021-03-16 12:42 GMT
తునిలో రైలు దహనం కేసుపై విజయవాడ రైల్వే కోర్టులో ఈ రోజు  విచారణ జరిగింది. ఈ రోజు కోర్టులో జరిగిన విచారణకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, తుని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హాజరయ్యారు. రైలు దహనం కేసులో అభియోగాలు ఎదుర్కొంటోన్న 41మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. తునిలో రైలుదహనం కేసుపై వచ్చిన అభియోగాలపై నిందితులను న్యాయమూర్తి విచారించారు.  వచ్చే నెల 6వ తేదీకి కేసు వాయిదా పడింది. తమపై అక్రమ కేసులు నమోదు చేశారని, రైలు దహనం కేసుతో తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులను వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే రైల్వే ఆస్తులకు జరిగిన నష్టంపై ఆర్ ‌పీఎఫ్‌ (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) నమోదు చేసిన కేసుల విచారణ రైల్వే కోర్టులో కొనసాగుతోంది. విచారణకు హాజరు కావాలని కొద్దిరోజుల క్రితమే న్యాయస్థానం ముద్రగడ, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, సుధాకర్‌ నాయుడు, నల్లా విష్ణుమూర్తి సహా 41 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. వారిలో 39 మంది మంగళవారం కోర్టుకు రాగా.. తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మండపేటకు చెందిన కామన ప్రభాకరరావు మార్చి 2 న ఉన్న వాయిదాకు హాజరుకాలేదు. తన బంధువులు మరణించినందున వాయిదాకు హాజరుకాలేనని దాడిశెట్టి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభాకరరావు మరో ప్రాంతంలో ఉండిపోవడం వల్ల రావడానికి వీల్లేకపోయిందని నిందితుల తరపున న్యాయవాది నరహరశెట్టి నరసింహారావు కోర్టుకు లిఖితపూర్వకంగా విన్నవించారు. ఈ రోజు ఆ ఇద్దరి తో కలిపి మొత్తం 41 మంది నింధితులు కోర్టుకి హాజరయ్యారు.
Tags:    

Similar News