వినోద్ ను ఓటమి వేదన నుంచి బయటపడేసిన సారు

Update: 2019-08-17 07:15 GMT
బోయినపల్లి వినోద్  కుమార్ అనే కన్నా.. టీఆర్ ఎస్ మాజీ ఎంపీ అన్నంతనే చటుక్కున గుర్తుకు వస్తారు. విషయాల మీద అవగాహన. గులాబీ పార్టీ పెట్టిన నాటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండటమే కాదు.. పార్టీ పాలసీల్ని జాతీయ స్థాయిలో గళం విప్పి వినిపించే సత్తా ఆయన సొంతం. విషయాలపై అవగాహనతో పాటు మంచి వాగ్దాటి.. అంతకు మించి కేసీఆర్ మనుసుకు తగ్గట్లు నడుచుకోవటం ఆయనకు అలవాటు. ఎన్నికల బరిలోకి దించితే గన్ షాట్ గెలుపు లిస్ట్ లో పేరుండే వినోద్.. అనూహ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు కావటం షాకింగ్ గా మారింది.

నిజానికి ఈ ఓటమిలో వినోద్ తప్పు కంటే కూడా కేసీఆర్ మీద వ్యతిరేకతే ఆయన్ను ఓడించిందని చెబుతారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరిపినా.. వారి సమస్యల మీద స్పందిస్తున్నా ఫలితం మాత్రం రాలేదన్న వేదనను ఓటమి తర్వాత తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లుగా చెబుతారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తన దారి తాను చూసుకుంటానన్నట్లుగా కొంత విరక్తిని ప్రదర్శించారు వినోద్.

ఆయన వేదనను అర్థం చేసుకున్న కేసీఆర్ ఆయనకు తగ్గ పదవి ఇచ్చేందుకు భారీగానే కసరత్తు చేసినట్లుగా చెబుతారు. తొలుత రాజ్యసభకు నామినేట్ చేయాలనుకున్నా సమీకరణాలు సెట్ కాకపోవటం.. తర్వాత ఆప్షన్ గా ఎమ్మెల్సీని చేసి మంత్రిమండలిలో తీసుకోవాలనుకున్నా.. అది సాధ్యం కాని పరిస్థితి. ఇలాంటివేళ.. ఆయన స్థాయికి తగ్గట్లుగా పదవి ఇవ్వాలన్న ప్రయత్నం ఎట్టకేలకు ఓకే అయ్యింది.

తాజాగా ఆయన్ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఎంపిక చేయటం ద్వారా.. వినోద్ కు తానెంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పేశారు కేసీఆర్. అంతేకాదు.. తన స్థాయికి తగ్గట్లు పదవి దక్కిందన్న సంతోషంతో వినోద్ ముఖంలో నవ్వులు పూశాయి. తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిలోనూ.. ఆర్థిక అంశాల విషయంలోనూ వినోద్ కీలకం కానున్నారు. ఆయనీ పదవిలో మూడేళ్లు సాగనున్నారు.

రానున్న కొద్దిరోజల్లో ప్రారంభమయ్యే తదుపరి వార్షిక బడ్జెట్ కసరత్తులో వినోద్ కీలకం కానున్నారు. తాజా పదవితో ఆయనకు కేబినెట్ హోదా లభించినట్లైంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఆయనకు మంత్రిమండలి సమావేశాలకు శాశ్విత ఆహ్వానితుడిగా ఉంటారు. మంత్రి కాదు కానీ.. మంత్రి మాదిరే ప్రాధాన్యత లభించటం చూస్తే.. ఓటమి వేదన నుంచి వినోద్ ను బయటకు పడేసేందుకు కేసీఆర్ కసరత్తును మెచ్చుకోవాల్సిందే. అదే సమయంలో.. ఇటీవల కాలంలో ఈటెలరాజేందర్ కు తగ్గిస్తున్న ప్రాధాన్యానికి తగ్గట్లే.. వినోద్ కు కీలక పదవి కట్టబెట్టటంపై గులాబీ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Tags:    

Similar News