హుజూర్ నగర్ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ ఎస్

Update: 2019-09-21 10:39 GMT
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి తెలిసిందే. సారు.. పదహారు అన్న నినాదానికి తెలంగాణ ప్రజలు ఊహించని రీతిలో షాకిచ్చిన వైనం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ బలం తగ్గలేదన్న సంకేతాల్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి తగిన సమయం కోసం చూస్తున్న గులాబీ బాస్ కు ఆ సమయం రానే వచ్చేసింది.

సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారన్న ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి ప్రకటనపై గడిచిన రెండు..మూడు రోజులుగా రచ్చ నెలకొనటం తెలిసిందే.

ఇలాంటివేళ.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తన రేసుగుర్రం ఎవరన్నది తేల్చేశారు. ఈ అంశంపై అందరి కంటే ముందుగా అభ్యర్థిని డిసైడ్ చేసిన క్రెడిట్ కేసీఆర్ కు దక్కుతుందని చెప్పాలి. ఈ స్థానం నుంచి పార్టీ నుంచి సైదిరెడ్డిని బరిలోకి దింపాలని డిసైడ్ చేశారు. హుజూరాబాద్ కు అక్టోబరు 21న ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నెల 23న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్లను దాఖలు సెప్టెంబరు 30తో ముగియనుంది. అక్టోబరు 1న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 3న గడువుగా డిసైడ్ చేశారు.

అక్టోబరు 21న ఈ ఎన్నికకు సంబంధించిన ఫోలింగ్ జరగనుంది. అక్టోబరు 24న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణలో తమ బలానికి తిరుగులేదన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఉంటే.. తమకున్న అతి కొద్దిమంది ఎమ్మెల్యేల నేపథ్యంలో తమ స్థానాన్ని తాము సొంతం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ మీద ఉంది. రానున్న రోజుల్లో తమదే తెలంగాణ అధికారపీఠమని చెప్పుకునే బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో తన ప్రభావం ఎంతన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కటం ఖాయమని చెప్పక తప్పదు.  


Tags:    

Similar News