ఏపీ గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై బదిలీ వేటుకు ప్రధాన కారణమదేనా?

Update: 2023-02-06 18:00 GMT
తాజాగా ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామ్‌ ప్రకాష్‌ సిసోడియాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆర్పీ సిసోడియాను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్పీ సిసోడియా స్థానంలో టీటీడీ మాజీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను నియమించింది.

అయితే ఆర్పీ సిసోడియాను ఇప్పటికిప్పుడు బదిలీ చేయడం వెనుక ఆయనపై ప్రభుత్వానికి ఆగ్రహం ఉండటమే కారణమని ఒక ప్రధాన పత్రిక కథనం ప్రచురించింది. ఇటీవల తమకు ప్రభుత్వం ప్రతి నెలా వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆ సంఘ ప్రతినిధులు గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే. తమకు ప్రభుత్వం సకాలంలో జీతభత్యాలు, ఆర్థిక ప్రయోజనాలు చెల్లించేలా ప్రత్యేక చట్టం తేవాలని గవర్నర్‌ ను కలసి సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

జీతాల కోసం ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ను కలవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలకు కూడా కారణమైంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, తదితరులు సూర్యనారాయణపై మండిపడ్డారు కూడా. మరోవైపు ప్రభుత్వం సైతం సూర్యనారాయణకు షోకాజు నోటీసులు జారీ చేసింది. నిబంధనలను మీరి గవర్నర్‌ కు ఫిర్యాదు చేయడంపై మీ ఉద్యోగ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాలపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సూర్యనారాయణ, తదితరులు గవర్నర్‌ ను కలవడం వెనుక ఆర్పీ సిసోడియా సహాయం చేశారని రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉందని ప్రధాన పత్రిక కథనం ప్రచురించింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌ను కలిసేందుకు ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా దోహదపడ్డారనే ఆయనపై ప్రభుత్వం తాజాగా బదిలీ వేటు వేసిందని ఆ పత్రిక పేర్కొంది.

అంతేకాకుండా ఆర్పీ సిసోడియాకు పోస్టింగ్‌ కూడా ఇవ్వకకుండా ఆయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయమని ఆదేశాలు ఇవ్వడానికి కూడా అదే కారణమని అధికారవర్గాలు భావిస్తున్నట్టు పత్రిక తన కథనంలో వెల్లడించింది.
4

గతంలో టీటీడీ ఈవోగా పనిచేసి ప్రస్తుతం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సిసోడియాను బదిలీ చేసి నాలుగు రోజులవుతున్నా ఇప్పటివరకు ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం గమనార్హం.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News