అమెరికాలో ఈ రోజు ఎవరినైనా ‘హగ్’ చేసుకోవచ్చు

Update: 2017-01-21 04:53 GMT
ఈ వార్త చదివే ముందు.. కండీషన్స్ అప్లై అన్న మాట మాత్రం తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్పిందే. మేం చెప్పినదేమీ అబద్ధం ఎంతమాత్రం కాదు. కాకుంటే.. హగ్ చేసుకునే ముందు అనుమతి తీసుకొని.. హగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ.. అమెరికాలో ఈ రోజు ఎవరినైనా హగ్ చేసుకోవటం ఏమిటి? ఎందుకలా? అన్న సందేహం కలుగుతోందా? మీ సందేహాలన్నింటిని తీర్చేస్తాం.

మన దగ్గరంటే బంధాలు.. అనుబంధాలు ఎక్కువే. ఇంకాస్త డ్రమటిక్ గా చెప్పాలంటే.. మెలో డ్రామ మన నరాల్లోనే ఉందని చెప్పకతప్పదు. ఇదేమీ తప్పు కాదు. మన పెద్దోళ్లు ముందుచూపుతో ఎలాంటి సమాజం అవసరమో చక్కగా సెట్ చేసేశారు. మనమే.. మనల్ని మనం చులకన చేసుకుంటాం కానీ.. మన పూర్వీకులు చాలా తెలివిగా ఒక చక్కటి సంప్రదాయాల్ని సెట్ చేశారు. మనతో పోలిస్తే.. అమెరికన్లు బిగసుకుపోయి ఉంటారు. మన ఊళ్లల్లో బాబాయ్.. పిన్ని.. అన్నా.. బావ.. ఇలాంటి పిలుపులతో చాలా దగ్గరగా ఉంటాం. తెల్లోళ్లలో ఇలాంటి బంధుత్వాల బంధం తక్కువే.

ప్రతి సంబంధం ఆర్థిక సంబంధం కాకున్నా.. ఇంచుమించు అలానే ఉంటుంది. ఎవరి ప్రపంచంలో వారు బతుకుతూ ఉంటారు. అందుకే కాస్త మనసులో తడి ఎక్కువగా ఉన్న అమెరికన్లు మధ్య మధ్యలో ఆ ‘దినం’ (డే).. ఈ ‘దినం’ అంటూ బండి నడిపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ‘నేషనల్ హగ్గింగ్ డే’. ఎవరికి వారు వేర్వేరుగా ఉండే తీరు కెవిన్ జబోర్ని అనే యువకుడికి అస్సలు నచ్చలేదు. మనిషన్నోడు ఏమీ పట్టనట్లు తన ప్రపంచంలో బతకటం ఏమిటని ఫీలయ్యాడు. అందుకే.. హగ్గింగ్ డేను తీసుకొచ్చాడు.

ఎందుకు? అని ప్రశ్నించినోళ్లకు అతడిచ్చిన సమాధానం ఏమిటంటే.. క్రిస్మస్ నుంచి వాలెంటైన్స్ డే వరకూ అంతా ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. మధ్యలో ఒక రోజును హగ్ డే అనుకుంటే ఆ ఫీల్ కంటిన్యూ అవుతుందన్న ఆలోచనతో అని చెప్పాడట. అతని వాదనకు అమెరికన్లు కన్వీన్స్ కావటంతో 1986 జనవరి 21 నుంచి ప్రతి ఏటా ఇదే రోజున ‘కౌగిలింతల దినోత్సవాన్ని’ నిర్వహిస్తుంటారు. అంటే.. అమెరికాలో ఈ రోజు ఎవరు ఎవరినైనా హగ్ చేసుకోవచ్చు. కాకుంటే.. ముందస్తుగా వారి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. అనుబంధాల విషయంలో అగ్రరాజ్యం అగ్రతాంబూలం అందుకోవాలనే లక్ష్యంతో ఈ డేను తీసుకొచ్చారు. కూసింత ఆత్మీయత కోసం అమెరికావోడు ఎంతగా తపిస్తున్నాడో కదూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News