తిరుప‌తి ఉప పోరు.. రాష్ట్రంలో స‌ర్వ‌త్రా ఆస‌క్తి!

Update: 2020-11-18 08:50 GMT
త్వ‌ర‌లోనే తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారులు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి స‌మాచారం సేక‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన  ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు విజ‌యం సాధించా రు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఎస్సీ వ‌ర్గాల‌కు కేటాయించిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల అనంత‌రం.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభంలో స్థానికం ప్రారంభ‌మైనా.. మ‌ద్య‌లోనే నిలిచిపోయింది.

మ‌రోవైపు రాజ‌ధానిపై జ‌గ‌న్ వైఖ‌రి.. పాల‌న‌లో ఏర్ప‌డుతున్న లోటుపాట్లు వంటి అంశాల‌తో ప్ర‌జల్లో జ‌గ‌న్ స‌ర్కారుపై వ్య‌తిరేకత ఏర్ప‌డింద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని, త‌న పార్టీ వారిని, త‌న కులం వారినిమాత్ర‌మే జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఆరోపిస్తున్నారు. మ‌రీముఖ్యంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తున్న టీడీపీ, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ పార్టీలు.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి.. అమ‌రావ‌తి ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ప్ర‌భుత్వం దీనిపై స్పందించ‌క‌పోయినా.. ఇప్పుడు.. ఉప ఎన్నిక మాత్రం అనివార్యంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలైన టీడీపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు.. అమ‌రావ‌తి అజెండాతోనే తిరుప‌తి ఉప పోరుకు ప‌క్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నాయి. ఇక‌, రాష్ట్రాన్ని అంతా మేమే అభివృద్ధి చేస్తున్నాం.. పోల‌వ‌రం క‌ట్టే బాధ్య‌త కూడా మాదేనంటూ.. బీజేపీ కూడా తిరుప‌తి పోరుకు రెడీ అవుతోంది. ఎటొచ్చీ.. జ‌న‌సేన పార్టీకే ఒక విధానం అంటూ లేకుండా పోయింది. స‌రే! ఇప్పుడు వైసీపీకి ఈ ఉప ఎన్నిక పాఠం చెబుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. క్షేత్ర‌స్థాయిలో నిజంగానే ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంటే.. తిరుపతి ఉప ఎన్నిక ఒక్క‌టే దానికి గీటురాయిగా మారుతుందా?  అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. తిరుప‌తి ప్ర‌జ‌లు రాజ‌ధాని విష‌యాన్ని పెద్ద సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌ధాని కోసం అనేక రూపాల్లో ఉద్య‌మానికి పిలుపునిచ్చినా.. ఇక్క‌డ ప్ర‌జ‌లు పెద్ద‌గా స్పందించ‌లేదు. పైగా చిత్తూరు వ్యాప్తంగా వైసీపీ గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. గ్రేట‌ర్ తిరుప‌తి ప్ర‌క‌ట‌న వైసీపీకి క‌లిసివ‌స్తోంది. అదేస‌మ‌యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామి వ్యూహాలు కూడా బాగా ప‌నిచేస్తున్నాయ‌నే టాక్ ఉంది. ఈ క్ర‌మంలో టీడీపీకి ఎడ్జ్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అదేస‌మ‌యంలో బీజేపీ లేవ‌నెత్తిన తిరుమ‌ల వివాదాలు ప్ర‌జ‌ల్లో బాగానేప‌నిచేస్తున్నా.. ఆ పార్టీని న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక‌, బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ కుటుంబంపై సానుభూతి ప‌వ‌నాలు అంతో ఇంతో లేక పోలేదు. దీంతో ఫ‌లితం వైసీపీకి అనుకూలంగాఉంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News