డెడ్ లైన్ పెట్టిన తికాయత్ ..రెచ్చగొడుతున్న కేంద్రం

Update: 2021-02-07 09:10 GMT
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమం చేస్తున్న రైతులను కేంద్రం బాగా రెచ్చగొడుతోంది. ఒకవైపు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుసంఘాల నేత రాకేష్ తికాయత్ అక్టోబర్ 2వ తేదీని డెడ్ లైన్ ను ప్రకటించారు. ఇదే సమయంలో రైతులను కరెంటు దొంగలుగా కేంద్రమంత్రులు అభివర్ణించటం మరింత హీట్ పెంచేస్తోంది. మొదటినుండి కూడా కొందరు కేంద్రమంత్రులు రైతుసంఘాలను, ఆందోళనను చాలా పలుచన చేసి మాట్లాడుతున్నారు. రైతుల ఉద్యమం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.

ఒకవైపేమో రైతుఉద్యమాన్ని తట్టుకోలేక ప్రధానమంత్రి నరేంద్రమోడి నానా అవస్తలు పడుతున్నారు. ఉద్యమాన్ని ఎలా ఆపాలో తెలీక మోడి కిందా మీదా అవుతున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరిగిపోతోంది. ఇక్కడే కాకుండా అంతర్జాతీయస్ధాయి సెలబ్రిటీల్లో కూడా కొందరు ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. దీంతో ప్రధానమంత్రి ప్రతిభ అంతర్జాతీయస్ధాయిలో కాస్త మసకబారినట్లే అయ్యింది.

ఇటువంటి సమయంలో రైతులతో బుజ్జగింపుగా మాట్లాడాలి లేకపోతే అసలు మాట్లాడనే కూడదు. అలాంటిది రైతులను అవమానించేట్లుగా కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో మరింత వేడి రాజుకుంటోంది. రైతులను కరెంటు దొంగలుగా అభివర్ణించటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటంలేదు. అలాగే ఆమధ్య ఉద్యమాలు చేస్తున్నది రైతులు కాదని ఉగ్రవాదులని, పాకిస్ధాన్ కు చెందిన తీవ్రవాదులు కూడా ఉన్నారంటూ కేంద్రమంత్రులు చేసిన ఆరోపణలతో అప్పట్లో బాగా హీట్ పెరిగిపోయింది.

ప్రస్తుతం రైతుఉద్యమానికి పంజాబ్, హర్యానా రాష్ట్రాలే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, తెలంగాణా, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో అక్టోబర్ 2వ తేది వరకు ఉద్యమం చేయటానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తికాయత్ ప్రకటించట సంచలనంగా మారింది. అక్టోబర్ 2వ తేదీ అంటే ఇంకా  సుమారుగా ఎనిమిది నెలలుంది. తికాయత్ ప్రకటన చూస్తుంటే రైతులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారన్న విషయం అర్ధమైపోతోంది. మరి ఇన్ని నెలలు కేంద్రం ఉద్యమాన్ని ఎలా భరించగలదు ? చూడాలి ఏమి జరుగుతుందో.
Tags:    

Similar News